-ప్రతీ నియోజకవర్గానికి 10 వేల సూర్యఘర్ యూనిట్లు మంజూరు
-ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కోసం రూ.2.60 లక్షల వ్యయం
-నా తొలి సంతకం 45 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు పైనే
-మరో 25 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు
-ఏలూరులో 33\11 కేవీ సబ్ స్టేషన్ భూమిపూజలో మంత్రి గొట్టిపాటి రవికుమార్
మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
24 గంటల నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని ఏలూరు గ్రామంలో 33\11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు గురువారం నాడు మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లో ఓల్టేజ్ సమస్యలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ప్రజలతో పాటు రైతులకు, పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని తెలిపారు. ఇందుకుగాను ప్రకాశం జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత 6 కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాట్లు మంత్రి వివరించారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను ప్రజలతో పాటు రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. రూ.3.90 కోట్లతో నిర్మిస్తున్న సబ్ స్టేషన్ తో చుట్టుపక్కల ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా… రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తామన్నారు. గతంలోలాగా.. రైతులు అర్థరాత్రి సమయాల్లోనూ, తెల్లవారుజామున పొలాలకు వెళ్లి విద్యుత్ వినియోగించేకునే అవసరం ఇకపై ఉండదని మంత్రి గొట్టిపాటి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు సుమారు 70 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని తెలిపిన ఆయన.., ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కోసం మూడు స్తంభాలు, ఒక ట్రాన్స్ ఫార్మర్, కండక్టర్ తో కలిపి… రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2.60 లక్షల ఖర్చు చేస్తుందని చెప్పారు.
ప్రతీ ఇంటా సూర్యఘర్ కావాలి….
పునరుత్పాదక విద్యుత్ వినియోగంలో అందరినీ భాగస్వాములను చేసేందుకు కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలను రాష్ట్ర ప్రజలందరూ వినియోగించుకోవాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ 10,000 సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 1కేడబ్ల్యు, 2కేడబ్ల్యు, 3కేడబ్ల్యు కెపాసిటీ కలిగిన సూర్యఘర్ పథకం ద్వారా ఒక్కో కిలో వాట్ కు రూ.30 వేలు సబ్సిడీ పొందవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు.. సూర్య ఘర్ ద్వారా పూర్తి ఉచితంగా సొలరైజేషన్ చేసుకోవచ్చని తెలిపారు. బీసీలకు అయితే కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.20,000 సబ్సిడీ అందిస్తుందని మంత్రి వివరించారు. సోలార్ వినియోగం పెరిగితే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గి ప్రజలపై భారం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో పాట పలువురు కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News