-ఆగస్టు 17 నుండి 23 వరకు పర్యటన పూర్తి… స్వదేశానికి తిరిగి చేరుకున్న విద్యార్థులు
-అభినందించిన సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులు ఆగస్టు 17 నుండి 23 వరకు ‘సాకురా సైన్స్ ప్రోగ్రామ్’లో భాగంగా జపాన్ సందర్శించి సోమవారం స్వదేశానికి తిరిగి క్షేమంగా చేరుకున్నారని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., తెలిపారు.
జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (JST) 2014 నుండి ‘జపాన్-ఆసియా యూత్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్ ఇన్ సైన్స్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనిని ‘సాకురా సైన్స్ ప్రోగ్రామ్’ అని పిలుస్తారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుండి 34 మంది విద్యార్థులు ఈ సందర్శనలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ నుండి టి.పుష్పాంజలి (జెడ్పీహెచ్ఎస్, గొల్లప్రోలు, కాకినాడ), కె.హరీష్ (ఏపీ మోడల్ స్కూల్, భోగాపురం, విజయనగరం జిల్లా), ఎం.ఐశ్వర్య (కేజీబీవీ, బిట్రగుంట, ప్రకాశం జిల్లా), పి. వరుణ్ సాయి (ఎంపిఎల్ హై స్కూల్, వీవర్స్ కాలనీ, మంగళగిరి, గుంటూరు జిల్లా) సాకురా సైన్స్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారు.
పర్యటన విజయవంతంగా ముగిసిన సందర్భంగా విద్యార్థులు సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., ని కలిసి పర్యటన ముచ్చట్లు పంచుకున్నారు. ఎస్పీడీ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రయాణ సమాచారం, విద్యార్థుల పరిశీలన అంశాలు, వివిధ పర్యటన ప్రదేశాల గురించి అడిగి తెలుసుకున్నారు. జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాన్ని సందర్శించడం ఒక సువర్ణావకాశమని, బాగా చదివి ఉన్నత లక్ష్యాల దిశగా పయనించాలని ఆకాంక్షించారు. ఈ విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బాగా చదవాలని కోరారు.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ (MoE), పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం (DoSEL) ఆధ్వర్యంలో NCERT, న్యూ ఢిల్లీలో ఆగస్టు 17న జరిగిన కార్యక్రమంలో సంజయ్ కుమార్ IAS., (కార్యదర్శి, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం) జెండా ఊపి శుభాకాంక్షలు తెలిపారన్నారు.
Prajavartha Online Telugu News