-నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించండి…
-ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పారదర్శంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేయండి..
-జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో యూరియా ఎరువులకు కొరత లేదని రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులు నానో యూరియా వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా మంగళవారం కంచికచర్లలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని, చందర్లపాడు మండలంలోని కొనయపాలెం ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతంగానికి అవసరమైన యూరియా ఎరువులను ప్రభుత్వం సిద్దంగా ఉంచడం జరిగిందని ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదాన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,003 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని.. మరికొంత యూరియా ఈ రోజు అందుబాటులోకి రానున్నదన్నారు. వరి నాటు వేసినప్పుడు ఒకటో విడతగా ఎకరానికి 30 కిలోలు వేయొచ్చని.. నాటు వేసిన 30 రోజులకు రెండో విడతగా ఎకరానికి 30 కిలోలు, నాటు వేసిన 60 రోజులకు మూడో విడతగా ఎకరానికి 30 కిలోలు వేసేలా రైతులలో అవగాహన కల్పించాలన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భయాందోళనకు గురిచేసేలా సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవన్నారు. అన్నదాతలకు ప్రతిఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. అపోహలను నమ్మవద్దని ఏవైనా సందేహాలుంటే కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు.
అనంతరం నందిగామ మండలం ఆడవిరావులపాడు గ్రామంలో చౌక ధరల దుకాణాన్ని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా తనిఖీ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను కార్డుదారులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 957 రేషన్ షాపుల ద్వారా 5 లక్షల 90,243 కార్డుదారులకు 8వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన 57,వేల 690 మంది కార్డుదారులను గుర్తించామని వారికి రేషన్ డీలర్లు ద్వారా ఇంటి వద్దనే నిత్యావసర సరుకులను అందజేసే ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దానిపై క్యూ.ఆర్.కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, మొబ్కెల్ ఫోన్ ద్వారా దీనిని స్కాన్ చేసి రేషన్ సరఫరాపై కార్డుదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా అన్నారు.
ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో శ్రీ కె. బాలకృష్ణ, ఏడిఎ.శ్రీనివాస్, డిఏఎస్ వెంకటస్వామి, కంచికచర్ల, చందర్లపాడు తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News