ముంబాయిలో, నేటి పత్రిక ప్రజావార్త :
ముంబాయిలో న నిర్వహించిన బిజినెస్ లైన్ చేంజ్మేకర్ అవార్డ్స్ – 2025 ఏడవ ఎడిషన్లో, కేంద్ర పెట్రోలియం & సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చే , గిరిజన సహకార సంస్థ (GCC)కు చెందిన అరకు వ్యాలీ కాఫీకి, “ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్” విభాగంలో చేంజ్మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు – 2025 లభించింది. ఈ పురస్కారాన్ని గౌరవ అతిథి నుంచి GCC వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కల్పన కుమారి, IAS గౌరవంగా స్వీకరించారు. 1956లో స్థాపితమైన నాటినుంచి గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి పట్ల నిబద్దతతో పనిచేస్తున్న GCC, 1970లలో అరకు వ్యాలీలో ప్రవేశపెట్టిన కాఫీ సాగు ద్వారా గిరిజనుల జీవనశైలిలో మార్పు తీసుకువచ్చింది. ఇది జీవనోపాధిని పెంచడముతో పాటుగా వ్యవసాయాన్ని స్థిరమైన, ఆదాయకరమైన వృత్తిగా తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కూడా పరిరక్షించింది. అరకు కాఫీ విజయగాథ పటిష్టమైన సంఘటిత కృషికి ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా పాడేరు మరియు చింతపల్లి మండలాలలోని డివిజనల్ మేనేజర్లు, మేనేజర్లు మరియు కాఫీ సేకరణ సిబ్బంది రైతులతో నేరుగా పనిచేస్తూ ప్రాథమిక స్థాయిలోనే నాణ్యతను నిర్ధారించారు. అదే విధంగా, జి.సి.సి. ప్రధాన కార్యాలయంలోని కాఫీ విభాగం సమన్వయం, మార్గదర్శనం, పర్యవేక్షణ ద్వారా ప్రతి దశలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విలువ శ్రేణి రూపొందించబడింది. ఈ సమిష్టి కృషి ఫలితంగా గిరిజన రైతులకు స్థిర ఆదాయం, గౌరవభరిత జీవితం మరియు అంతర్జాతీయ గుర్తింపు లభించాయి. 2019లో GI ట్యాగ్ పొందిన తరువాత అరకు కాఫీకి ప్రీమియం అంతర్జాతీయ మార్కెట్లను తెరిచింది. ఈ బ్రాండ్ సేంద్రీయ స్వచ్ఛత, మధుర సువాసన మరియు ప్రత్యేక రుచితో విశిష్టతను సంపాదించుకుంది. ఈ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ, 2024లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మరియు జి.కె. వీధి మండలాల్లో 2,600 మంది రైతుల 6,000 ఎకరాల కాఫీ మరియు మిరియాల తోటలకు సేంద్రియ ధ్రువీకరణ పొందింది. ఇప్పుడు మరో నాలుగు మండలాల్లో 15,000 ఎకరాల విస్తీర్ణానికి ధ్రువీకరణ విస్తరించే ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఇది కాఫీ, మిరియాలతోపాటు రాగి, రాజ్మా, పసుపు, అల్లం వంటి పంటలకూ వర్తిస్తుంది. దీని ద్వారా 10,000 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అదేవిధంగా, 2025 ఆగస్టు 9న పాడేరులో జరిగిన ఆదివాసీ దినోత్సవాల్లో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి సమక్షంలో GCC మరియు టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (TCPL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ద్వారా దేశంలో తొలిసారిగా “సేంద్రియ సాల్యూబుల్ కాఫీ” (Organic Soluble Coffee) ఉత్పత్తి ప్రారంభం కానుంది. అంతేకాకుండా, మౌలిక వసతుల బలోపేతం కోసం, నర్సీపట్నం సమీపంలోని మాకవరపాలెం మండలం, శెట్టిపాలెం గ్రామంలో ఆధునిక సాంకేతికతతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ (Bean to Cup మోడల్) ఏర్పాటుచేస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 ఎకరాల భూమిని కేటాయించి, రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి మరియు మార్కెట్ వ్యాప్తిని పెంచుతుంది. ఈ సందర్భంలో శ్రీమతి కల్పన కుమారి, IAS, వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, GCC మాట్లాడుతూ: “ఈ అవార్డు మన గిరిజన రైతులు మరియు GCC సిబ్బంది త్యాగం, అంకితభావానికి చిహ్నం. అరకు వ్యాలీ కాఫీ ఒక బ్రాండ్ మాత్రమే కాదు, అది గిరిజనుల గౌరవానికి, భారతదేశ గర్వానికి ప్రతీక. గ్లోబల్ మార్కెట్లలో జి.సి.సి. అరకు వ్యాలీ కాఫీని విస్తరించడంలోను, మన రైతులకు మరింత గొప్ప పురోగతిని సులభతరం చేయడానికి AI తో సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం జరుగుతుంది”. ఈ పురస్కారాన్ని వేలాది గిరిజన రైతులు మరియు పాడేరు ఏజెన్సీ అంతటా సేవలందిస్తున్న వందలాది GCC ఉద్యోగులకు ఆమె అంకితమిచ్చారు. అరకు కాఫీ కార్యకలాపాలను — విస్తరణ, సేంద్రియ ధ్రువీకరణ సహా — స్వయంగా పర్యవేక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దూరదృష్టి, మార్గదర్శకత్వం, మద్దతుకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన రైతుల సాధికారతకు, సహకార వ్యవస్థల బలోపేతానికి ముఖ్యమంత్రి నిబద్ధత ఈ జాతీయ గుర్తింపు వెనుక ఉన్న ప్రధాన శక్తిగా ఆమె అభిప్రాయపడ్డారు.
Prajavartha Online Telugu News