– క్రీడా సామగ్రి, ఆట బొమ్మలు మరింత చౌకగా లభ్యం
– జీఎస్టీ సంస్కరణలతో స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ దిశగా మరో ముందడుగు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జీఎస్టీ 2.0 సంస్కరణలతో క్రీడా రంగానికి కొత్త వెలుగులు వచ్చాయని.. ఈ రంగానికి మరింత ఊపు వచ్చేలా క్రీడా సామగ్రి, ఆట బొమ్మలు మరింత చౌకగా లభ్యమవుతున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వద్ద ప్రత్యేక ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తాయని.. జీఎస్టీ సంస్కరణలతో ఎంఎస్ఎంఈలు కూడా క్రీడా పరికరాల తయారీ విభాగంలో పెట్టుబడులు పెట్టే అవకాశముందన్నారు. క్రీడల ఔత్సాహికులకు తక్కువ ధరల్లోనే క్రీడా సామగ్రి అందుబాటులోకి రావడం వారిని మరింత ఉత్సాహంగా ముందుకు నడుపుతుందన్నారు. ఈ సంస్కరణల వల్ల ఆనందం, ఆరోగ్యం.. రెండింటికీ ఆర్థిక మద్దతు లభిస్తోందని.. దేశీయ తయారీదారులకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే ఆదాను కుటుంబ విద్య, ఆరోగ్యం, పెట్టుబడులు వంటివాటికి ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ బ్యాటులు, బాల్స్, క్రీడా దుస్తులు, బ్యాడ్మింటన్ రాకెట్, బ్యాటరీ రహిత బొమ్మలు తదితరాలపై జీఎస్టీ తగ్గిందన్నారు. ఉదాహరణకు గతంలో రూ. 1,120 ఉన్న క్రికెట్ బ్యాటు ఇప్పడు రూ. 1,050కే లభిస్తుందన్నారు. మన ఫిట్నెస్ను కాపాడుకునేందుకు అవసరమయ్యే సామగ్రి గతం కంటే తక్కువ ధరకు లభిస్తున్నాయని ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీవో ఎస్ఏ అజీజ్, జిల్లా యువజన సంక్షేమ అధికారి యు.శ్రీనివాసరావు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News