– జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది
– జిల్లా కో ఆర్డినేటర్ డా పి ప్రియాంక
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ పత్రికలలో వచ్చిన ప్రతికూల వార్తల నేపథ్యంలో, డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలందించే క్రమంలో జిల్లా యంత్రాంగం అన్ని అవసరమైన చర్యలు చేపట్టిందని జిల్లా కోఆర్డినేటర్ పి. ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య సిబ్బంది అసోసియేషన్ పిలుపు మేరకు వైద్య సేవల నిలుపుదల సమ్మె కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా రూ.250 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి మరియు జిల్లా అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అలాగే రాజమహేంద్రవరం లోని జి.ఎస్.ఎల్. మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ మరియు జి.ఎస్.ఎల్. కాన్సర్ హాస్పిటల్ లలో డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్య సేవ పథకం కింద ఉచిత వైద్య సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. సమ్మె ప్రభావం కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవల ద్వారా రోగులను డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్య సేవలు కొనసాగిస్తున్న ఆసుపత్రులకు తరలించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇందుకోసం వైద్యమిత్రాలు మరియు టీమ్ లీడర్లను సంప్రదించి అవసరమైన సహాయం పొందవచ్చని సూచించారు. ఉచిత వైద్య సేవలకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా సహాయం అవసరమైతే క్రింది నంబర్లను సంప్రదించాలని జిల్లా అధికారులు తెలిపారు: జిల్లా సమన్వయ అధికారి: 9281068129 , కార్యాలయ నంబర్: 9281068159
Prajavartha Online Telugu News