Breaking News

అన్ని శాఖల సమన్వయంతో పంట, ఆస్తి నష్టాలను కనిష్ఠ స్ధాయికి నియంత్రించాలి…

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాను కారణంగా జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టి, అన్ని శాఖల సమన్వయంతో పంట, ఆస్తి నష్టాలను కనిష్ఠ స్ధాయికి నియంత్రించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు.

సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానందా హాలులో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టనాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ మొంథా తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక నేపద్యంలో విపత్తు నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను, సంసిద్దతను సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో బాటు జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణ తేజ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, గంటి హరీష్ మాధూర్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ,, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, డసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాల్గొన్నారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి.బిందుమాధవ్ మొంథా తుఫాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టిన కార్యాచరణలను మంత్రికి వివరించారు. అలాగే మొంథా తుఫాను ఉదృతి 1996లో వచ్చిన తుఫాను స్థాయిలో ఉండే అవకాశం ఉన్నందున నాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా ఇన్ చార్ఝి మంత్రి నారాయణ మాట్లాడుతూ తుఫాను పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షించి ఆదేశాలు జారీ చేస్తున్నారని, తుఫాను కారణంగా కాకినాడ జిల్లాలో ఒక్క ప్రాణానికి కూడా నష్టం కలుగకుండా అధికారులు పటిష్టమైన రక్షణ, సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే తుఫాను కారణంగా పంటలకు, ఆస్తులకు జరిగే నష్టాలను కనిష్ట సాయికి ఉండేలా నియంత్రించాలని కోరారు.

అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమీక్షలో చర్చించిన అంశాలను, మొంథా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు.

అవి – వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన “ మొంథా తుఫాను” వేగంగా కాకినాడ తీరం సమీపములో ఈనెల 28వ సాయంత్రం నుండి 29వ తేదీ తెల్లవారు లోపు తీరాన్ని దాటే అవకాశం ఉన్న దృష్య్యా సందర్భముగా కాకినాడ జిల్లాలో తుపాను నష్టాల నివారణకు ప్రభుత్వము ఈ తుఫాను వలన ఎటువంటి ప్రాణనష్టం లేకుండా, పంట, ఆస్తి నష్టాలను కనిష్ట స్థాయికి నియంత్రించేందుకు ప్రభుత్వం తరపున అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నాం. అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పటిష్టంగా అమలు చేస్తున్నాం.

-జిల్లా కేంద్రంలోను, అన్ని మండలములలోను 24×7 పని చేసే విధముగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయుట జరిగినది. ముఖ్యముగా తీర ప్రాంత మండలములైనటువంటి ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, తొండంగి, కాకినాడ రూరల్ & అర్బన్ మరియు సరిహద్దు మండలములలో మండల/గ్రామ సిబ్బందిని తుఫాను రక్షణ చర్యలు తీసుకొను విధముగా అప్రమత్తంగా ఉంచడం జరిగినది.

-ప్రజలకు తుఫాను సమాచారం ఎప్పటికప్పుడు స్థానిక రేడియో, టీవీ, సోషల్ మీడియా ద్వారా తెలియజేసి, తుఫాను సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించడం జరుగుతున్నది. ప్రతి గ్రామంలో వలంటీర్ ద్వారా “తుఫాను హెచ్చరిక వ్యవస్థ” ను రియల్ టైమ్ అందించడం జరుగుతున్నది.

-పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ వసతి గృహాలలో తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి పునరావాస కేంద్రానికి ఇంచార్జ్ లను నియమించడం జరిగింది. అన్ని పునరావాస కేంద్రాల వద్ద త్రాగునీరు, ఆహారం, విద్యుత్, వైద్య సహాయం, మొబైల్ ఛార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగినది. జిల్లాలో మొత్తం 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఇన్ చార్జులను నియమించాం. 7 రోజులకు సరిపడా నిత్యావసరాలు, మందుల నిల్వలు ఏర్పాటు చేసాం.
-పునరావాస సిబ్బందికి, సచివాలయ సిబ్బంది మరియు యితర అధికారులకు తుఫాను సమయములో తీసుకొనవలసిన జాగ్రత్తల పై శిక్షణ యివ్వడం జరిగినది. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి తుఫాను సమయములో తీసుకొనవలసిన జాగ్రత్తల పై తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు మరియు మత్స్యకారులకు ఆర్థిక సహాయం, బియ్యం మరియు అవసరమైన వస్తువులు అందేలా ఫుడ్ ప్యాక్స్ సిద్ధం చేయడం జరిగినది. పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలు తుఫాను ముప్పు తొలగే వరకూ ఇంటికి వెళ్లిపోకుండా ప్రజాప్రతినిధులతో నచ్చజెప్పి ఒప్పించి, పోలీస్ సిబ్బందిని పర్యవేక్షణ ఉంచుతున్నాం. ఉప్పాడ, మూలపేట, కోనపాపపేటలలో కుకింగ్ సెంటర్ల ఏర్పాటుతో బాటు, అన్నవరం దేవస్థానం, అక్షయ, అల్లూరి సీతారామరాజు ఫౌండేషన్ల ద్వారా 10 వేలు చప్పున ఆహార పాకెట్లు సరఫరా చేయనున్నాం. హోప్ ఐలాండ్ లో నివశిస్తున్న ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించాం.

-50 మందితో SDRF బృందాలు, 30 మందితో NDRF బృందాలను అందుబాటులో సంసిద్ధంగా ఉంచాం. ముంపు ప్రాంతములకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతములలో చేరవేసేందుకు 40 బోట్లను, 100 మంది సిబ్బందిని, 140 గజ ఈతగాళ్లను అత్యవసర అవసరాల కోసము అందుబాటులో ఉంచాం.

-తీర ప్రాంత మండలాలైన ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, తొండంగి, కాకినాడ రూరల్ & అర్బన్, సరిహద్దు మండలములలో అవసరమైనటువంటి సహాయక చర్యల కోసం లారీలు, టిప్పర్లు, క్రేన్లు, జెసిబీలు, ట్రాక్టర్ లు అందుబాటులో ఉంచాం. అవసరమైన జనరేటర్స్ ను, టార్చ్ లైట్లను, ఇంధన నిల్వలు అన్ని మండల కేంద్రములలోను సిద్ధంగా ఉంచుట జరిగినది.

-142 గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులను ముందుగ జాగ్రత్తగా దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాం. జిల్లాలో 108 అంబులెన్స్ లు 23 వాహనాలు, 104 వాహనములు 35, రోగులను తరలించేందుకు అందుబాటులో ఉంచుట జరిగినది.తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ వైద్య బృందాలను ఏర్పాటు చేయుట జరిగినది. పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 7 రోజులకు సరిపడ అత్యవసర మందుల నిల్వలను అన్ని CHC & PHCల యందు మరియు వైద్య శిబిరాల యందు అందుబాటులో ఉంచడం జరిగినది.అవసరమైన అదనపు వైద్య సిబ్బందిని CHC, పిఠాపురం, తాళ్ళరేవు మండలములలో నియమించడం జరిగినది. జిల్లాలో అవసరమైన ప్రథమ చికిత్స కిట్స్ ను అన్ని సచివాలయములలో అందుబాటులో ఉంచుట జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు శిశువులకు అవసరమైన పౌష్టిక ఆహారము అందుబాటులో ఉంచుడం జరిగినది.

-అన్ని పాఠశాలలకు ఈనెల 27 నుండి 29వ తేదీ వరకు సెలవులు ప్రకటించాం. 101 వసతి గృహాలు మరియు గురుకుల విద్యాలయములో ఉన్న 14,499 విద్యార్థులను వారి వారి సొంత ఇళ్ళకు తరలించడం జరిగినది.
-మత్స్యకార గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వేటకు వెళ్ళకుండా నిషేధమును అమలు చెయ్యడం జరిగినది.ఇప్పటికే సముద్రం వేటలో ఉన్న 600 పడవలను తీరానికి సురక్షితంగా వెనకకు రప్పించే చర్యలు తీసుకోవడం జరిగినది. ఎలాంటి మత్స్యకార పడవలు సముద్రంలో ఉండకుండా, హార్బర్ అధికారులు ద్వారా నిరంతర పర్యవేక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.

-రైతులకు అవగాహన కల్పించి, పంటల కోతను వాయిదా వేసుకోవలసినదిగా సూచించాం. క్షేత్ర స్థాయి వ్యవసాయ సిబ్బందిని ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించేందుకు కోసము రైతులకు అందుబాటు ఉండేలని ఆదేశించాం. పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించి, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకొనడం జరిగినది.

-ఏలేరు ప్రాజెక్టు నుండి నీరు విడుదల ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నందున, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. ఏలేరు, పంపా సాగునీటి వ్యవస్థలలో బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలు, గట్టులను గుర్తించి, వాటికి అవసరమైన రక్షణ, పటిష్టీకరణ కోసం ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుట జరిగినది. ప్రతి 2, 3 గంటలకు జిల్లాలో ఉన్న ముఖ్య జలాశయాలు నీటి స్థాయిని రికార్డు చేసి, ప్రమాదాల ప్రభావాలకి గురయ్యే మండలాలను గమనించి, సమగ్ర నివేదికను సమర్పించే విధముగా చర్యలు తీసుకొనుట జరిగినది. ముంపునీరు గ్రామాల్లోకి ప్రవహించకుండా పొలాల్లోకి మళ్లించే అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగినది.

-కాలువలు, డ్రైన్లు మూసుకుపోకుండా క్లియర్ చేయించుట కొరకు ఇద్దరు తహసిల్దార్ లను నియమించి, అధికముగా ప్రవహించు నీటిని సముద్రంలోకి పంపే విధముగా తగు చర్యలు తీసుకొనడం జరిగినది. అదే విధముగా గ్రామాలు, పట్టన వార్డులలో గల డ్రైన్లు పూడిక, అవరోధాల తొలగింపుకు ఆదేశించాం.

-భారీ వర్షాలకు, గాలులకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగకుండా భద్రతా చర్యలు తీసుకోడం జరుగుతున్నది. విద్యుత్ వ్యవస్థకు నష్టం కలిగితే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్దరణ కోసం రాయలసీమ జిల్లాల నుండి 100 మంది విద్యుత్ సిబ్బందిని తీసుకుని రావడం జరిగింది. కూలిన విద్యుత్ స్థంబాలను పునరుద్దరించేందుకు 3వేల పోల్స్ సిద్దంగా ఉంచాం. అలాగే శిక్షణ పొందిన 300 మంది ఫైర్ సిబ్బంది, 35 మంది అధికారులను అత్యవసర సేవల కొరకు సిద్దంగా ఉంచాం.

-రోడ్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి, రవాణా మార్గాలకు ఎటువంటి అడ్డంకి మరియు ట్రాఫిక్ రద్దీ లేని విధంగా పునరుద్దరణకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. తుఫాను ప్రభావిత ప్రాంతాల బస్సు సర్వీస్ లు రద్దు చేయడం జరిగినది.

-త్రాగునీటి చెరువులు, ట్యాంకులు మరియు యితర ప్రాంతములు కలుషితం కాకుండా చర్యలు తీసుకొని, త్రాగునీటిని ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొనుట జరిగినది.
-తుఫానుకు సంబంధించి ప్రభుత్వ సంస్థలు, వాతావరణ శాఖ, విపత్తుల నియంత్రణ శాఖ, జిల్లా యంత్రాంగం తెలియజేసే సమాచారాన్నే విశ్వసించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అవాస్తవాలను, ఊహాగానాలను ప్రచారం చేసి ప్రజలను అయోమయానికి, భయాందోళనలకు గురి చేయవద్దని సోషల్ మీడియాకు సూచించారు.

-మొంథా తుఫాను సందర్భంగా “ఒక్క ప్రాణం కూడా నష్టం పోకూడదనేదే” ప్రభుత్వ ప్రధాన లక్ష్యంమని మంత్రి నారాణయణ తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *