Breaking News

మండలంలోని సముద్ర తీరాన్ని పరిశీలన…

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మోంత తుఫాన్ కారణంగా జిల్లాలో ఏ ఒక్క ప్రాణ నష్టము జరగరాదని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా తుపాను ప్రత్యేక అధికారి , పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ తేజ , కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి యూ కొత్తపల్లి మండలంలో పర్యటించారు. మండలంలోని సముద్ర తీరాన్ని పరిశీలించారు. యూ కొత్తపల్లి లోని లోతట్టు పల్లపు ప్రాంతాలను పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను సమయంలో లోతట్టు ప్రాంతాలే కాకుండా అన్నిచోట్ల భారీ వర్షాలు కురిసి ఈదురుగాలులతో బీభత్సం సృష్టిస్తాయన్నారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఏ ఒక్క ప్రాణ నష్టము జరగకుండా అధికారులందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. రెవెన్యూ ,పంచాయతీ ,పోలీస్ అధికారులు కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలన్నారు .

అధికారులు సిబ్బంది అందరూ కూడా వారి వారి ప్రధాన కార్య స్థానాల్లో అందుబాటులో ఉండాలన్నారు. తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మంచినీరు ఎక్కడ కూడా కలుషితం కాకుండా చూడాలని అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు.

గ్రామాల్లో పూరి గుడిసెల లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రానికి చేర్చాలన్నారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టరాదని అందరినీ తరలించాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగరాదని స్పష్టం చేశారు. ఎక్కడైనా రహదారి మార్గాల్లో చెట్లు గాని, విద్యుత్ స్తంభాలు గాని పడిపోతే రాకపోకలకు అంతరాయం కలగకుండా వెంటనే వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ సౌకర్యాన్ని కూడా వెంటనే పునరుద్ధ రించాలన్నారు. ఇందుకోసం అవసరమైన విద్యుత్ రంపాలను, క్రేన్లను తదితర యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచా మన్నూరు.
గర్భవతులు, వృద్ధులు, బాలింతలను ఆసుపత్రులకు పంపించారా లేదా అని విచారించి, పంపించారని చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

తదనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మోంత తుఫాను వలన జిల్లాలో ఈనెల 27, 28, 29 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 28వ తేదీన తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీచడంతోపాటు బీభత్సమైన వర్షము కురుస్తుందన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామ, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అందరినీ అప్రమత్తం చేశామన్నారు .

లోతట్టు ప్రాంతాలు, కాలువ గట్లు, పూరిల్లు, తాటిపాకలు పెంకుటిల్ల లో నివసిస్తున్న ప్రజలను వెంటనే తుఫాను వలన ఇబ్బంది కలగకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 269 పునరావాస కేంద్రాలను గుర్తించి సిద్ధం చేశామన్నారు. తుపాను ప్రభావిత మండలాల్లోని ప్రతి గ్రామంలో అధికారులు ఇంటింటికి వెళ్లి తుఫాను సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో ఈనెల 27, 28, 29 తేదీలలో అన్ని విద్యాసంస్థలకు సెలవు దినాలుగా ప్రకటించామని తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ వారి ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఎవరు కూడా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

పూరిల్లు, పాకలు, బలహీనమైన ఇళ్లల్లో ఉండే వారు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా రావాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరికి ప్రాణం నష్టం జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. పునరావాస కేంద్రాలలో మంచినీరు ఆహారంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం ,ఎస్ డి అర్ ఎఫ్ ఇప్పటికే జిల్లాలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *