అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రములో పత్తి పంట ప్రధానముగా కర్నూలు, పల్నాడు, యన్.టి.ఆర్., ఆనంతపురము, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలలో అధికముగా సాగు చేయబడుతుంది. 2025-26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 5.39 లక్షల హెక్టార్లలో పత్తి సాగు కాగా, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేయడమైనది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరపై సి.సి.ఐ. వారు కొనుగోలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం జి.వొ.నెం.843, తేదీ:25.09.2025 ద్వారా మార్గ దర్శకాలను జారి చేయడం జరిగినది. ఈ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించడానికి సంబంధిత జాయింట్ కలెక్టర్ వారి ఆద్వర్యములో జిల్లా స్థాయి కమిటీని అలాగే జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి వారి ఆధ్వర్యములో కొనుగోలు కేంద్రం వారీగా క్షేత్రస్థాయిలో కమిటీలని ఏర్పాటుచేయడం జరిగినది.
సి.సి.ఐ. కొనుగోలు ప్రక్రియలో బాగముగా రైతులు, రైతు సేవా కేంద్రములలో తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసిన తరువాత కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని తమ పంటను సి.సి. ఐ. కొనుగోలు కేంద్రములకు తరలించాల్సి ఉంది. గత నెల తేదీ:29.10.2025 నుండి సి.సి.ఐ. వారు ఈ సీజనకు గాను పత్తి కొనుగోలు ప్రారంబించియున్నారు. కపాస్ కిసాన్ స్లాట్ బుకింగ్ లో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే గౌరవ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖా మాత్యులు పలు విషయాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లారు.
మంత్రి అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం రైతుల నమోదు మరియు స్లాట్ బుకింగ్ వివరాలను మరింత సరళతరం చేసేవిదంగా కపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) ను సీఎం యాప్ (CM APP) తో అనుసంధానం చేయడం జరిగినది. అలాగే, రైతులు తమ సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునే వెసులుబాటు కల్పించడమైనది మరియు కపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) లోని సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించుటకు కోసం గుంటూరులో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని కూడా నియమించడమైనది.
ఈ సంవత్సర౦ రాష్ట్రంలో నేటి వరకు 11 మార్కెట్ యార్డులతో పాటుగా 66 జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రములుగా ప్రకటించడం జరిగినది. ఇప్పటి వరకు 24 జిన్నింగ్ మిల్లుల ద్వారా 3643 రైతుల నుండి రూ.78.13 కోట్ల విలువ గల 99623 క్వింటాల్ ల పత్తిని కొనుగోలు చేయడం జరిగినది. ప్రస్తుతం గత రెండు సంవత్సరముతో పోలిస్తే ఈ సంవత్సరం రెండు రెట్లు అధికముగా కొనుగోలు చేయడం జరిగినది.
రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుచున్నది. నేడు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, గురజాల కేంద్రాలలో పత్తి కొనుగోలునుపరిశీలించగా ప్రస్తుతం కొనుగోళ్ళు సజావుగా జరుగుతున్నాయి. పలువురు రైతులు సి.సి.ఐ. వారు నిబంధనల మేరకు ఎక్కువ తేమ శాతం ఉన్న పత్తిని కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం మోంథా తుఫాను మరియు ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పత్తి పంటలో తేమ శాతం 12% నుండి 18% వరకు ఉన్న పత్తిని కూడా అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయుటకు మరియు వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని కూడా తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయుటకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడం జరిగినది, ఇవి కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవి, వీటిపై త్వరలో తగు నిర్ణయం తీసుకునే విధముగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు వారి పంటను పూర్తిగా విక్రయిచేంత వరకు కొనుగోలు కేంద్రములు తెరిచి ఉంటాయి. కావున రైతులు వారి పంట ఉత్పత్తికి లబించే ధరను తేమ శాతం వలన నష్టపోకుండా నాణ్యతా ప్రమాణాల మేరకు సి.సి.ఐ. కొనుగోలు కేంద్రములకు తీసుకువచ్చి కనీస మద్దతు ధర పొందవలసినదిగా కోరడమైనది. అలాగే రైతులకు ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కొనుగోలు చేయవలసినదిగా మార్కెట్ కమిటీ మరియు సి.సి.ఐ. అధికారులను డైరెక్టర్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు ఆదేశించడమైనది.
Prajavartha Online Telugu News