– ఆధ్యాత్మిక శోభతో వెలుగులీనిన మొగల్రాజపురం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శబరిమల యాత్ర నియమ నిష్టలతో దీక్ష వహించి, కఠోర దీక్షా కాలంలో పునీతులైన అయ్యప్ప స్వాములకు స్వాగతం పలికిన మొగల్రాజపురం, పడిపూజతో భక్తి పారవశ్యంలో మునిగింది, హరిహరసుతుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి దివ్య దర్శనంతో, మంగళ హారతుల సమర్పణతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక తరంగాలతో ఉప్పొంగింది, వేలాది మంది అయ్యప్ప స్వాములతో పాటు, అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.
బ్రహ్మశ్రీ మురళీధరన్ నంబూద్రి స్వామి వారి పర్యవేక్షణలో, అత్యంత శాస్త్రోక్తంగా, నియమ నిష్టలతో నిర్వహించిన అయ్యప్ప స్వామివారి ప్రత్యేక పూజలు సకల జగత్తుకు, ముఖ్యంగా బొండా ఉమ కుటుంబానికి, ఆంధ్ర రాష్ట్రానికి, సెంట్రల్ నియోజకవర్గానికి శుభం చేకూర్చాలని, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని భక్తులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
సోమవారం మొగల్రాజపురం లోని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు స్వగృహమునందు, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, వారి కుమారులు బొండా సిద్ధార్థ స్వామి, బొండా రవితేజ స్వామి ల పవిత్రమైన ఆధ్వర్యంలో, కేరళ సంప్రదాయాల ప్రకారం బ్రహ్మశ్రీ మురళీధరన్ నంబూద్రి గురుస్వామి లచే మహా పడిపూజ కార్యక్రమమును అంగరంగ వైభవముగా, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది.
పూజా వేదికను సుందరంగా అలంకరించి దీపాలతో, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు, అయ్యప్ప స్వామివారి ప్రతిమ ముందు మాలలు, ప్రమిదలు, అగరబత్తులు, కర్పూరం వెలిగించడంతో పరిసరాలన్నీ దివ్యమైన సుగంధాలతో నిండిపోయాయి, నంబూద్రి స్వామి వారి వేద మంత్రోచ్ఛారణలతో, భజనలతో, శరణు ఘోషతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది.
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ కఠిన నియమాలను ఆచరిస్తూ, 41 రోజుల మండల దీక్షను చేపట్టి, అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్పను శరణు వేడుకునే ఈ పవిత్రమైన మండలకాలంలో పడిపూజలు నిర్వహించడం అత్యంత విశేషమని, ఇది అయ్యప్ప స్వామివారి ఆశీస్సులను పొందడానికి ఒక చక్కటి అవకాశమని ఉద్ఘాటించారు. ఈ పడిపూజ ద్వారా సమాజంలో ధర్మం నిలబడాలని, ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, ఆనందం, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు, అయ్యప్ప స్వామి దీక్ష ఎంత పవిత్రమైనదో, ఈ పడిపూజ కూడా అంతే పవిత్రమైనదని, ఇది భక్తులకు స్వామివారికి మరింత చేరువయ్యే మార్గాన్ని సుగమం చేస్తుందని ఆయన వివరించారు.
ఈ మహా పడిపూజ కార్యక్రమానికి, అయ్యప్ప దీక్ష ధరించిన స్వాములు, శివ స్వాములు, భవానీలు, అలాగే అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు యావన్మంది అత్యంత భక్తి శ్రద్ధలతో విచ్చేశారు. భక్తి పారవశ్యంతో, శరణు ఘోషతో స్వామి వారి నామస్మరణ చేస్తూ, పూజలో పాల్గొన్నారు. అనంతరం, స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించి, అయ్యప్ప కృపకు పాత్రులు అయ్యారు. ఈ కార్యక్రమం కేవలం ఒక పూజగా కాకుండా, భక్తి భావనను, ఆధ్యాత్మిక ఐక్యతను పెంపొందించే గొప్ప సామూహిక అనుభవంగా నిలిచింది. భక్తులు తమ మనస్సులను, ఆత్మలను పవిత్రం చేసుకుని, నూతన ఉత్తేజంతో తిరిగి వెళ్లారు.
Prajavartha Online Telugu News