– టెక్ తోడుగా గ్లోబల్ మార్కెట్‌ను అందిపుచ్చుకోండి
– బ్రైడిజిటల్ ఏఐ 5.0 సదస్సులో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవకాశాలను మెరుగుపరుస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
శుక్రవారం విజయవాడ, జీఆర్టీ హోటల్లో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంత్రప్రెన్యూర్స్ (అలెప్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన బ్రైడిజిటల్ ఏఐ 5.0 సదస్సులో వివిధ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, స్టార్టప్‌ల యువ బృందాలు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం విద్యాసంస్థలు (అకడమియా), స్టార్టప్స్, పరిశ్రమల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడమని చెప్పారు. ఇండియా ఏఐ మిషన్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వశాఖ హబ్ లక్ష్యాలను చేరుకునేందుకు ఇలాంటి సదస్సులు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమం బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ), బిజినెస్ టు గవర్నమెంట్ (బీ2జీ) నెట్‌వర్కింగ్‌కు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతులు, స్టార్టప్ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు. సదస్సు సందర్భంగా లబ్ధిదారులైన 40 స్టార్టప్‌లు తమ వ్యాపార నమూనాలు, ఉత్పత్తులు మరియు ఆవిష్కరణలను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమంలో అలెప్ అధ్యక్షురాలు సి.రమాదేవి, ఉపాధ్యక్షురాలు స్వరూపారాణి, ఎస్టీఐ డైరెక్టర్ కవిత, అలెప్ ప్రతినిధులు, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News