-సంగీత ప్రియులను అలరించనున్న కృష్ణవేణి సంగీత నీరాజనం
-రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం
-కేంద్ర టూరిజం శాఖ సంచాలకులు (సౌత్) డి. వెంకటేశన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లు (సంగీత నాటక అకాడమీ), రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో 2025 ఎడిషన్ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కేంద్ర టూరిజం శాఖ సంచాలకులు (సౌత్) డి. వెంకటేశన్ తెలిపారు.
గుణదలలోని పార్క్ హయత్ హోటల్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శుక్రవారం కేంద్ర టూరిజం శాఖ సంచాలకులు (సౌత్) ఆర్. వెంకటేషన్, ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ (ఆశా) అధ్యక్షులు రామిశెట్టి వీరాస్వామి లు కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో 6 వ తేదీ ఉదయం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంస్కృతిక కేంద్రంగా తరచుగా పరిగణించబడే విజయవాడ ఈ ప్రాంతానికున్న గొప్ప సంగీత వారసత్వాన్ని పురస్కరించుకొని సంగీత ప్రియులను అలరించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాస్త్రీయ కర్ణాటక సంగీతాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా 2025 సంవత్సరానికి తెలుగు సంగీత సంప్రదాయాల గొప్పతనం అనే థీమ్ సంగీత సంప్రదాయాలను హైలైట్ చేస్తుందన్నారు. హరికథ, సంకీర్తన, వీణా కచేరీలు, గాత్ర కచేరీలు, పంచరత్న కృతులు వంటి సామూహిక ప్రదర్శనలు ఉంటాయని, ప్రఖ్యాత సంగీత కళాకారులు, రాష్ట్రంతోపాటు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సంగీత సంస్ధలు నుండి విద్యార్థులు పాల్గొంటారన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం దాని సంగీత ప్రదర్శనలతోపాటు క్రాఫ్ట్ బజార్లు, చేనేత ప్రదర్శనలు, స్థానిక కళాకారులు, నేత కార్మికులు సమగ్ర సాంస్కృతిక ప్రదర్శనలు అందిస్తారన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం సంగీత ప్రియులను, విద్యార్థులను, సాంస్కృతిక ఔత్సాహికులను, వారసత్వం, భక్తి మరియు కళాత్మకత మరపురాని వేడుకలకు స్వాగతిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ (ఆశా) అధ్యక్షులు రామిశెట్టి వీరా స్వామి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు, సాంస్కృతిక (సంగీత నాటక అకాడమీ), స్టార్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహిస్తున్నామన్నారు. సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించడం, చేతివృత్తులు, నేత కార్మికులకు ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే కృష్ణ వేణీ సంగీత నీరాజనంలో 98 మంది కళాకారులతో మొత్తం 18 కచేరీలు కనువిందు చేయనున్నాయని స్వామి తెలియజేశారు. తదనంతరం కృష్ణ వేణీ సంగీత నీరాజనం కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు.
Prajavartha Online Telugu News