Breaking News

సాంస్కృతిక వికాసానికి, కళా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: మంత్రి కందుల దుర్గేష్

– అట్టహాసంగా ప్రారంభమైన ఆర్ఎంసి కార్నివాల్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్నివాల్ నిర్వహించుకోవడం సంతోషదాయకమని రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రెండు రోజుల పాటు నగరంలో నిర్వహిస్తున్న ఆర్ఎంసి కార్నివాల్‌ను శనివారం సుబ్రహ్మణ్య మైదానం నందు ఘనంగా ప్రారంభించారు.కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య “ఫుడ్ – మ్యూజిక్ – ఫన్” థీమ్‌తో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కన్సర్ట్స్, విభిన్న రకాల ఫుడ్ స్టాళ్లు, చిన్నారులకు వినోదాన్ని పంచే ఆటలు, సెల్ఫీ బూత్‌లు సందర్శకులను విశేషంగా ఆకర్షించాయి. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ , శాసన సభ్యులు తదితరులు స్టాళ్లను సందర్శించి సంప్రదాయ వంటకాలను రుచి చూశారు. అనంతరం సంగీత కళాకారుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ బ్రహ్మజ్యోస్యుల సుబ్రహ్మణం పేరుతో ప్రారంభమైన ఈ మైదానంలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందదాయకమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్నివాల్ నగరానికి పండుగ శోభను తీసుకువచ్చిందని అభివర్ణించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కుటుంబ సమేతంగా ప్రజలందరూ పాల్గొని ఆనందించేలా నగరపాలక సంస్థ ఈ వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. దైనందిన జీవితంలో ప్రజలు నిత్యం ఒత్తిళ్లకు లోనవుతూ సాంస్కృతిక వికాసానికి దూరమవుతున్నారని మంత్రి తెలిపారు. ఇటువంటి తరుణంలో ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు రాజమహేంద్రవరానికి ఉన్న గత వైభవాన్ని పునఃప్రారంభించేందుకు ఈ కార్నివాల్ ఒక చక్కని ప్రయత్నమని అన్నారు. ఆంధ్రా రుచులతో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించే విధంగా స్టాళ్లను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కళలను మరియు కళాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉగాది పురస్కారాల నుంచి ప్రతినెలా ఒక రాష్ట్ర పండుగను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో 2027 పుష్కరాల వరకు ప్రతినెలా నగరంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా రాజమహేంద్రవరానికి ఉన్న గత వైభవాన్ని నిలబెట్టుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే ఆనం కళాకేంద్రంలో గతంలో నిర్వహించిన నంది నాటకోత్సవాల వంటి కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించి, కళాకారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ … సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో కళలు, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్నివాల్ నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు సాంస్కృతిక అనుభూతులను అందిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని ఆనందించేలా ఈ కార్యక్రమాలు నగరానికి పండుగ శోభను తీసుకువచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, ఆర్డీఓ ఆర్. కృష్ణ నాయక్, అడిషనల్ ఎస్పీ డి. మురళీకృష్ణ, ఆర్ఎంసి అడిషనల్ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ దాసరి ప్రియా సౌజన్య, ఏపీ శెట్టిబలిజ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, ఇతర అధికారులు మరియు పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *