-సహకార ఉద్యమానికి 75 ఏళ్ల గర్వకర చరిత్ర
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం ది రాయనగర్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ప్లాటినమ్ జూబ్లీ (వజ్రోత్సవ) ఉత్సవాలు, అలాగే సొసైటీ స్థాపకులు మరియు దాని పురోగతి, అభివృద్ధికి నాయకత్వ స్థాయిలో విశేష సేవలందించిన డా॥ సి.యల్. రాయుడు, కె. పెద వెంకట రాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సొసైటీ స్థాపన నుంచి 75 వసంతాల గర్వకర ప్రస్థానాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన అనంతర సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, రాయనగర్ కో-ఆపరేటివ్ సొసైటీ సహకార ఉద్యమానికి ఆదర్శంగా నిలిచిందని, సభ్యుల సంక్షేమం, నివాస అవసరాల పరిపూరణలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. స్థాపకులు డా॥ సి.యల్. రాయుడు, కె. పెద వెంకట రాయుడు సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, వారి స్మృతిగా విగ్రహాల ఆవిష్కరణ జరగడం భవిష్యత్ తరాలకు ప్రేరణనిచ్చే అంశమని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రాము పాల్గొని, సొసైటీ అభివృద్ధికి తమ అభినందనలు తెలియజేశారు. సొసైటీ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News