తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన “ఉద్యమి – క్రియాశీలక సభ్యత్వ దిశానిర్దేశ సభ” ఘనంగా జరిగింది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సమన్వయకర్త ఆరాణి శ్రీనివాసులు, చిత్తూరు పార్లమెంట్ సమన్వయకర్త లీల కృష్ణ సహా వివిధ చైర్మన్లు, నియోజకవర్గ నాయకులు, ఇంచార్జీలు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… తిరుపతి వంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం నుండి పార్టీ నిర్మాణానికి బలమైన శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యమి (క్రియాశీలక సభ్యత్వం) కార్యక్రమం పార్టీ భవిష్యత్‌కు పునాది రాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సభ్యత్వం అనేది కేవలం నమోదు ప్రక్రియ కాదని, అది పార్టీ సిద్ధాంతాల పట్ల అంకితభావం మరియు ప్రజాసేవ పట్ల నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ప్రజలకు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కార మార్గంలోకి తీసుకువెళ్లే రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గం నుండి మండల, బూత్ స్థాయిల వరకు ప్రతి కార్యకర్త తన నాయకత్వాన్ని పెంపొందించుకొని ప్రజలకు చేరువ కావాలని సూచించారు. క్రియాశీలక సభ్యులకు అందించే ఇన్సూరెన్స్ సదుపాయం కార్యకర్తల కుటుంబాలకు రక్షణ కవచమని పేర్కొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్యమి కార్యక్రమం కోసం రూ. 2 కోట్లు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, కార్యకర్తల శిక్షణ, అభివృద్ధి, సంక్షేమానికి అధినేత ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ… తిరుపతి పార్లమెంట్ పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లక్ష్యబద్ధంగా అమలు చేయాలని సూచించారు. సభ్యత్వం పార్టీ విస్తరణకు మూలాధారం అని, క్రమశిక్షణతో కూడిన నాయకత్వాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ ఇదేనని తెలిపారు. ప్రతి మండలం, ప్రతి బూత్ స్థాయిలో బృందాలు ఏర్పాటు చేసి యువత, మహిళలు, కొత్తగా చేరే కార్యకర్తలను పెద్ద సంఖ్యలో సభ్యత్వంలో చేర్చాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో ఉద్యమి కార్యక్రమాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని అన్నారు.
ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ… తిరుపతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. తిరుపతి పార్లమెంట్ పరిధిని సభ్యత్వ నమోదు లో ముందంజలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ సభ పార్టీ బలోపేతానికి దృఢమైన దిశానిర్దేశాన్ని అందించింది.
Prajavartha Online Telugu News