-ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు
-దేశంలో సమగ్ర విద్యా విధాన రూపకర్త మౌలానా అబుల్ కలాం ఆజాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన స్వాతంత్య్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు. విద్యాశాఖామంత్రిగా 11 సంవత్సరాలపాటు పనిచేసి దేశంలో సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు అబుల్ కలాం పునాదులు వేశారన్నారు. అంతేకాకుండా బ్రిటిష్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సంగీతం, సాహిత్యాల వికాసానికి చేయూతనిచ్చారన్నారు. 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే UGC, ICCR, AICTU, CINR వంటి ప్రతిష్టాత్మక సంస్థలతోపాటు ఖరగ్పూర్లో సాంకేతిక విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా 1992లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించిందని గుర్తుచేశారు. ఆ మహనీయుని స్ఫూర్తితోనే నేడు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతూ.. దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన, నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం విద్య తదితర పథకాలతో పేదలకు మెరుగైన విద్య అందించగలుగుతోందన్నారు. ఈ సందర్భంగా ఆ మహనీయునికి మరోసారి ఘనమైన నివాళులు అర్పిస్తున్నట్లు తెలియజేశారు.
Prajavartha Online Telugu News