-మంగళగిరిలో ప్రజల అర్జీలు స్వీకరించిన డా. పసుపులేటి హరిప్రసాద్
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ప్రతిరూపంగా నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం రెండో రోజు కూడా ప్రజల విశేష స్పందన మధ్య కొనసాగింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, పరిపాలనా సమస్యలను వినిపిస్తూ వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను బాధ్యతాయుతంగా పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ, జనసేన పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. జనవాణి కార్యక్రమం ప్రజలకు పార్టీ నాయకత్వాన్ని నేరుగా కలిసే వేదికగా మారిందని, ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనవాణి కార్యక్రమం ప్రజల్లో విశేష నమ్మకాన్ని పెంచిందన్నారు. ప్రజల గొంతుకగా, వారి ఆశయాలకు అండగా జనసేన పార్టీ నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ పొన్న యుగంధర్, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ సీరివేలు గంగాధర్, పీలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బెజవాడ దినేష్, ఎన్‌ఆర్‌ఐ సానా గారు, జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News