Breaking News

హజ్–2026 యాత్ర విజయవంతం

-విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ద్వారా వెళ్లిన 333 మంది హాజీల ఖాతాల్లో రూ.1 లక్ష జమ
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాషా కృతజ్ఞతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హజ్ యాత్ర–2026 కు చెందిన హజ్ యాత్రికులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం సంతోషంగా ఉందని హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాషా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాషా అధ్యక్షతన శుక్రవారం విజయవాడ లబ్బీపేట కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ల ద్వారా సుమారు 2,000 మంది హాజీలు పవిత్ర మక్కా యాత్రకు వెళ్లి, తమ మతపరమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని పేర్కొన్నారు. మక్కా, మదీనాలలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వచ్చిన హాజీలందరూ యాత్ర ఎంతో ప్రశాంతంగా సాగిందని, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని హజ్ కమిటీకి ఫోన్ల ద్వారా తెలియజేశారని చెప్పారు. యాత్ర మొత్తం రాష్ట్ర హజ్ ఇన్‌స్పెక్టర్లు, ఖాదీముల్ హుజ్జాజ్ హాజీలకు నిరంతరం సేవలందిస్తూ అన్ని విధాలా అండగా నిలిచారని వివరించారు.

ఎన్నికల హామీ మేరకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన ప్రతి అర్హుడైన హాజీకి రూ.1,00,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని హాజీ షేక్ హసన్ భాషా తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫారూఖ్ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వెళ్లిన 333 మంది అర్హులైన హాజీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో రూ.1 లక్ష చొప్పున జమ చేసినట్లు వెల్లడించారు.

ఈ ఆర్థిక సహాయం అందినట్లు హాజీలు స్వయంగా ఫోన్ల ద్వారా ధృవీకరిస్తూ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పారు. పవిత్ర మక్కా భూమిపై రాష్ట్ర ప్రజల సంక్షేమం, ప్రభుత్వ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు హాజీలు పేర్కొన్నారని తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ కు ముస్లిం సమాజం, హాజీలు, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *