విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద, శనివారం ఉదయం అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని కమిషనర్ ధ్యానచంద్ర, సిబ్బంది తో ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య పోరాటంలో తన ప్రాణాలను అర్పించి, దేశానికి అపూర్వమైన స్ఫూర్తినిచ్చిన మహానుభావుడని, దేశభక్తి, ధైర్యసాహసాల పరాకాష్ఠగా నిలిచిన ఆయన జీవితం ప్రతి భారతీయుడికి మార్గదర్శకమని పేర్కొన్నారు. నేటి యువత అతని స్ఫూర్తిని అనుసరించి దేశసేవలోకి ముందుకు రావాలని, ప్రజల సేవ చేయడం ద్వారా నిజమైన దేశభక్తిని చాటాలని అన్నారు. అల్లూరి సీతారామరాజు మన దేశ చరిత్రలో స్వాతంత్ర్య సమరయోధుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారని, అతని ధైర్యం, త్యాగం, దేశభక్తి మనకు ఎప్పటికీ పాఠాలుగా ఉంటాయని, అటువంటి మహానుభావుడికి నివాళులు అర్పించడం గర్వకారణం అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎ. రవీంద్ర రావు, చీఫ్ ఇంజినీర్ పి. సత్యకుమారి, అకౌంట్ ఆఫీసర్ బి. సత్యనారాయణ మూర్తి, మేనేజర్ ప్రభావతి, విఎంసి సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News