మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ. మాధవీలత సూచించారు. గురువారం ఆమె మచిలీపట్నం చిలకలపూడి శ్రీ పాండురంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీ చేపట్టారు విద్యార్థులతో ఆమె నేరుగా మాట్లాడి మధ్యాహ్న భోజన నిర్వహణ గురించి పలువురు విద్యార్థిని విధ్యార్దులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని, స్టాక్ రూమ్ను పరిశీలించారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని, నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీ కార్మికులకు ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఈ రోజు మెనూ ప్రకారం కిచిడి , గుడ్డు , టమాటో చట్నీ పిల్లలకు భోజనంలో అందించాల్సి ఉందని, అయితే కిచిడిలో పెసరపప్పు శాతం చాలా తక్కువుగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అలాగే, ఈ పాఠశాలలో అత్యల్ప సంఖ్యలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు గమనించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంను ఏ ఒక్కరూ నీరు కార్చడం సబబు కాదన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా రూపొందించిన పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల జాబితా ప్రకారం పిల్లలలకు మంచి పౌష్టికాహారం అందించాలని, బడి మధ్యలో మానివేసి విద్యార్థులను ఉత్తమమైన విద్య అందించాలనే లక్ష్యంతో తపిస్తున్నారని జె సి అన్నారు. ప్రధానోపాధ్యాయులు, మిగిలిన ఉపాధ్యాయులు వంట ఏజెన్సీలు ఏ విధంగా ఆహారాన్ని తయారుచేస్తున్నారో ప్రతిరోజూ తప్పక పర్యవేక్షించాలన్నారు. ఆహరం సరిగా వండని కారణంగా చిలకలపూడి శ్రీ పాండురంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీను తమ పద్ధతి మార్చుకోమని ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలలో మెనూ అమలుపై వివరాలను జగనన్న గోరుముద్ద యాప్లో హెచ్ఎంలు అప్లోడ్ చేస్తే ఆ వివరాలు సిఎం డ్యాష్బోర్డులో కనిపిస్తాయని తెలిపారు. వాటి ఆధారంగా పథకం అమలును స్వయంగా ముఖ్యమంత్రి సమీక్షిస్తారనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలన్నారు.
సచివాలయం పరిశీలన …
అనంతరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ. మాధవీలత 5 వ డివిజన్ లోని సచివాలయంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సచివాలయం పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించి స్థానిక సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సేవలు అందించాలని ఆమె సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లో సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలు, ఈ సర్వీసెస్, స్పందన ఫిర్యాదులు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.వాలంటీర్లు అందరూ బాధ్యతతో పని చేయాలని సూచించారు గ్రామ సచివాలయం పకడ్బందీగా నిర్వహిం చాలని ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి , మచిలీపట్నం తహశీల్ధార్ సునీల్ బాబు, ఎంఇఒ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News