-దశల వారీ చర్యలకు ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన
-పేద కుటుంబాల వారికి స్వాంతన చేకూర్చడమే లక్ష్యంగా..
-దాతల కుటుంబాల త్యాగనిరతిని మరిoత గుర్తించడoపైనా పరిశీలన
-విశాఖలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటన
-అవయవదాతల కుటుంబాలే నిజమైన విజేతలు: బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలను దృష్టిలో పెట్టుకొని అవయవ మార్పిడి చికిత్సలు బోధనాసుపత్రుల్లోనూ ఎక్కువగా జరిగేందుకు వీలుగా ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడిoచారు. రాష్ట్రంలోని 12 ప్రభుత్వాసుపత్రులను దశలవారీగా పూర్తి స్థాయి అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖలోని ఏ యు కన్వెన్షన్ సెంటర్ లో జీవన్ దాన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన కార్యకమoలో మంత్రి మాట్లాడారు. జీవన్మృతులు అవయవాలను దానం చేస్తే ఎనిమిది మందికి కొత్త జీవితం అందించవచ్చని చెప్పారు. అవయవదానంపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలని, ముందుగానే తమ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. రాష్ట్రంలో ఆదివారం నాటికి 5,935 మంది వివిధ అవయవాల కోసం నిరీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. అవసరమైన అవయవాలు కోసం నెలలు, సంవత్సరాల పాటు ఎదురుచూస్తున్న రోగులకు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ వైద్య వ్యవస్థ ద్వారానే శాశ్వత పరిష్కారం చూపాలన్నదే ఈ విధానం లక్ష్యమన్నారు.
ప్రైవేట్ వైద్యానికే పరిమితం కాకుండా….
‘2025లో రాష్ట్రంలో జరిగిన 5 అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగినవి కేవలం 31 మాత్రమే’ అని మంత్రి పేర్కొన్నారు. అధిక వ్యయం కారణంగా పేదలు చికిత్సకు దూరంగా ఉండకుండా ఉండేందుకు దశల వారీ గా ప్రభుత్వ రంగంలో అవయవ మార్పిడి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. 12 బోధన ఆసుపత్రుల్లో అవయవ సేకరణ కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ‘మొదటి దశలో విశాఖ, పలాస, కర్నూలు, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ బోధనా స్పత్రుల్లో మూత్రపిండాల మార్పిడి సేవలను విస్తరిస్తాo. 2028 నాటికి కాలేయ మార్పిడి, 2030 నాటికి విశాఖ, విజయవాడ, కర్నూలులో గుండె మార్పిడి సేవలను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్రంలో కేవలం మూడు అవయవ మార్పిడి కేంద్రాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఇప్పుడు ప్రత్యేక విధానం ద్వారా 12 ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నాo” అని వివరించారు. అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సలకు తగ్గట్లు చేపట్టాల్సిన వైద్యుల నియామకాలు, పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పన కు చర్యలు తీసుకోవడం పైన దృష్టి పెడతామన్నారు.
దాత కుటుంబాలకు మరింత భరోసా
అవయవదానం చేసిన వారి కుటుంబాలకు ప్రస్తుతం అంత్యక్రియల కోసం రూ.10 వేల సాయం అందిస్తున్నామని తెలిపారు. దీనిని రూ.లక్షకు పెంచే విషయం గురిoచి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు ఇదే సమయంలో అర్హులైన దాత కుటుంబ సభ్యులకు ఒప్పంద లేదా పొరుగు సేవల కింద ఉద్యోగం, ఆర్థిక పరిస్థితిని బట్టి పింఛన్ కల్పించే విషయమై ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయని చెప్పారు.
పెరుగుతున్న అవయవదానం–
ఇంకా చాలదు
రాష్ట్రంలో అవయవదానం క్రమంగా పెరుగుతోందని మంత్రి తెలిపారు. 2022లో 26 మంది, 2023లో 41 మంది, 2024లో 66 మంది, 2025లో 93 మంది దాతలు ముందుకొచ్చారని, 2026లో ఇప్పటివరకు 57 మంది దాతల ద్వారా 180 అవయవాలు సేకరించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ అవసరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువేనన్నారు.
అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రముఖ క్రీడాకారిని పీవీ సింధు వంటి ప్రముఖులు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. సినీ, క్రీడా ప్రముఖులు, సామాజిక మాధ్యమాల్లో ప్రభావం కలిగినవారంతా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఆ కుటుంబాల ధైర్యం ముందు మా విజయాలు చిన్నవే…
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
అవయవదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగు నింపుతున్న దాతల కుటుంబాలే నిజమైన విజేతలని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. తాను ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించినప్పటికీ, కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలోనూ అవయవదానానికి అంగీకరించడం అన్నింటికంటే గొప్ప విషయమని పేర్కొన్నారు. అలాంటి కుటుంబాల ధైర్యం ముందు క్రీడల్లో తాను సాధించిన విజయాలు కూడా చిన్నవిగానే అనిపిస్తాయని చెప్పారు. జీవన్‌దాన్ అవయవదాతల కుటుంబ సభ్యులు తమ అనుభవాలను వివరిస్తుండగా ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.
‘‘నేను ఎన్నో కఠినమైన పోటీలు ఆడాను. చివరి క్షణం వరకూ విజయం కోసం పోరాడాను. అయితే అవన్నీ క్రీడలు మాత్రమే. నిజమైన జీవన పోరాటం ప్రతి రోజూ ఆసుపత్రుల్లో, అత్యవసర చికిత్స విభాగాల్లో జరుగుతోంది. మన రాష్ట్రంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవయవం కోసం జీవన్‌దాన్ జాబితాలో ఎదురుచూస్తున్నారు. వారు కాలంతో పోరాడుతూ ఒక అద్భుతం జరుగుతుందనే ఆశతో జీవిస్తున్నారు’’ అని సింధు పేర్కొన్నారు.
పేరు, ప్రతిష్ఠ, విజయాల కంటే మరొకరిలో కొనసాగుతున్న గుండెచప్పుడు గొప్ప వారసత్వమని పీవీ సింధు అభిప్రాయపడ్డారు.
ఒక్క అవయవదాత ఎనిమిది మంది వరకు ప్రాణాలను కాపాడగలరని ఆమె తెలిపారు. అవయవదానం మరణానికి సంబంధించిన అంశం కాదని, అది జీవితానికి ఇచ్చే అత్యున్నత గౌరవమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అవయవాల సేకరణ, కేటాయింపు, మార్పిడి ప్రక్రియను సమర్థంగా నిర్వహిస్తోందని పీవీ సింధు ప్రశంసించారు.
రాష్ట్రంలోని యువతతో పాటు ప్రతి ఒక్కరూ జీవన్‌దాన్ పోర్టల్‌లో తమ పేరును నమోదు చేసుకొని, అవయవదాన ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ‘‘మన తర్వాత కూడా మరొకరికి జీవితం అందించే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మనం జీవితాన్ని బహుమతిగా అందిద్దాం’’ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ దాన్ తరఫున అవయవాల దానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటామని
ముఖ్య పర్యవేక్షకులు డాక్టర్ మన్మధరావు తెలిపారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ గ్రీఫ్ కౌన్సిలర్ మంగాదేవి ఇతరులు మాట్లాడిన వారిలో ఉన్నారు.
భావోద్వేగ ప్రసంగాలతో నిశ్శబ్దం.. నిశ్శబ్దం
అవయవాలను దానం చేసిన వారి కుటుంబ సభ్యుల భావోద్వేగ ప్రసంగాలతో ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో ఒక్కసారిగా నిశబ్ద వాతావరణం నెలకొంది. తాము కోల్పోయిన వారి అవయవాలతో మరొకరి ప్రాణాలు నిలబడటం దుఃఖంలో ఉన్న తమకు కాస్తoతా ఉపశమనం లభిస్తుందని పలువురు దాతలు కుటుంబ సభ్యులు చేసిన ప్రసంగాలు సభికుల హృదయాలను తాకాయి. ఈ కుటుంబం ఔదార్యాన్ని, ధైర్యాన్ని మంత్రి సత్య కుమార్ అభినందించారు. సముచిత రీతిన వారి సత్కరించారు
Prajavartha Online Telugu News