-భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువకులు
-పశ్చిమలో జెన్ జి వార్ ను షురూ చేసాం – వెలంపల్లి
-డిఎస్సి పేపర్ లీకేజ్ స్టార్ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి – వెలంపల్లి
-ఎన్నికల హామీల ప్రకారం నిరుద్యగులకు 3 వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలి – వెలంపల్లి
-జాతీయ గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్య కు డిఎస్సి లో ఉద్యోగం లేదు – దేవినేని అవినాష్
-కేవలం క్రీడలలో పాల్గొన్న సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారు – మల్లాది విష్ణు
-విద్య, వసతి దీవెన’ బకాయిలు రూ. 9,500 కోట్లు వెంటనే చెల్లించాలి – రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం నాడు స్థానిక భీమానవారిపేట లోగల ఓ ఫంక్షన్ హల నందు నియోజకవర్గంలోని విద్యార్థులు, యువకులు మరియు పార్టీ శ్రేణులతో కలిపి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు జెన్ జి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు మరియు యువకులకు డిఎస్సి లో జరిగిన అక్రమాలను, మరియు అవకతవకల పైన సవివరంగా వివరించిన జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ప్రదర్శించారు. ఫీజ్ రీయంబర్స్మెంట్ బకాయిల గురించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్న బకాయిల వివరాలను పిపిటి ద్వారా తెలియజేసారు. అనంతరం సమావేశానికి విచేసినటువంటి కొందరు విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క సమస్యలను సమావేశ వేదికగా స్వచ్చందంగా తెలిపారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యఅథిధులుగా విచ్చేసారు.
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ
డీఎస్సీ–2025 స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు లోకేష్ వెంటనే రాజీనామా చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జెన్ జి’ యువత మరియు నిరుద్యోగులు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారన్నారు. డీఎస్సీ-2025 నిర్వహణలో తీవ్ర అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటుచేసుకున్నాయన్నారు. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించి పారదర్శకతను దెబ్బతీశారన్నారు. అత్యంత గోప్యమైన ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడింగ్ మరియు డిజిటల్ నిర్వహణ పనులను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించి లీకేజీకి బాటలు వేశారన్నారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పురమ నవీన్ సోషల్ స్టడీస్‌లో కృష్ణా జిల్లా టాపర్‌గా, టీజీటీ తెలుగులో జోన్–2 లో 6వ ర్యాంకర్‌గా నిలవడం లీకేజీని స్పష్టంగా నిర్ధారిస్తోందన్నారు. అక్రమాలు బయటపడకుండా అతని పేరును మెరిట్ లిస్ట్ నుండి తొలగించి, డేటాను మాయం చేశారన్నారు. క్రీడా సంఘాల పగ్గాలు అధికార పార్టీ నేతల చేతిలోనే ఉన్నాయన్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, జూడో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా ఎంపీ భరత్ వ్యవహరిస్తూ తమ పరిధిలోని సంఘాల నుండి పారదర్శకత లేకుండా సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. ఈ భారీ స్కామ్‌పై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని మరియు లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. 2024 ఎన్నికల సమయంలో ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారన్నారు కానీ ఈ రెండేళ్లలో చంద్రబాబు పాలనలో నిరుద్యోగులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. యువతను మోసం చేసిన ఈ తీరును ప్రశ్నిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని మరియు మల్లాది విష్ణు, రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ
జీఓ 74 ప్రకారం ఉన్న 2% స్పోర్ట్స్ కోటాను జీఓ 4, 47 ద్వారా 3%కి పెంచి, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు పోటీ పరీక్ష రాయాలనే నిబంధనను ఎత్తివేశారన్నారు. తమ వర్గానికి చెందిన అభ్యర్థులతో పోస్టులు నింపిన తర్వాత, మళ్లీ పాత నిబంధనలు తెస్తూ జీఓ 56 జారీ చేశారన్నారు. ఆర్చేరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్య వంటి ప్రతిభావంతుడికి ఉద్యోగం ఇవ్వకుండా, కేవలం పాల్గొన్న సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఒక్కో టీచర్ పోస్టును రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షలకు విక్రయించిన ఆధారాలు బయటపడినా, నిందితులపై బలహీనమైన కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌పై వదిలేయడం వెనుక పెద్దల ప్రమేయం స్పష్టమవుతోందన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు రూ. 9,500 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య వర, మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, క్లస్టర్, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థిని, విద్యార్థులు, యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News