Breaking News

“విద్య… వసతి.. వికాసం”లో దాతలు భాగస్వాములు కావాలి

-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు
-పేద విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు కలెక్టర్ వినూత్న ప్రయత్నం అభినందనీయం
-ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, వెంకట కృష్ణారెడ్డి

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో వినూత్నంగా చేపట్టిన విద్య.. వసతి.. వికాసం కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూడా తమ భాగస్వామ్యాన్ని పంచుకోవచ్చని, విద్యార్థులకు అవసరమైన వసతులు, సామాగ్రిని హాస్టళ్లకు సమకూర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. దాతలు అందించిన సామాగ్రి, పరికరాలపై వారి పేరును చిరస్థాయిగా నిలిచేలా పొందుపరుస్తామని చెప్పారు.

మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో విద్యా.. వసతి.. వికాసం కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మి క్లుప్తంగా వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 155 ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు రెండు నెలల ముందు నుంచే విద్యా.. వసతి.. వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలోని సీఎస్‌ఆర్ నిధులు, దాతల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, మైనింగ్, పరిశ్రమల శాఖల అధికారులు తమ పరిధిలోని సంస్థలకు, ప్రముఖ వ్యక్తులకు ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించి, వారిని ఇందులో భాగస్వామ్యం చేయాలని కోరారు. పేద బిడ్డలకు మంచి చేసే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమ వంతు తోడ్పాటు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పేద విద్యార్థుల హాస్టళ్ళ అభివృద్ధికి సహకారం అందించాలనుకునే దాతలు dbcweo.nlr.18@gmail.com, cpo_nlr@yahoo.co.in ఈమెయిల్స్ ను సంప్రదించాలని కోరారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలవుతున్నాయని, అదే స్ఫూర్తితో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల హాస్టళ్ల అభివృద్ధికి “విద్య.. వసతి.. వికాసం” కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ గొప్ప కార్యక్రమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కలెక్టర్ నిర్ణయాన్ని ప్రత్యేకంగా స్వాగతించారు. ఈ పథకం ద్వారా హాస్టళ్ల రూపురేఖలతో పాటు పేద విద్యార్థులకు మంచి వసతి సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. ఈ పథకంలో హాస్టళ్ల కాంపౌండ్ వాల్స్, హాస్టల్ ప్రాంగణాల్లో కాంక్రీట్ ఫ్లోరింగ్, సీసీ కెమెరాలు వంటి ఏర్పాట్లపై కూడా దృష్టి సారించాలని సూచించారు.

ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ కలెక్టర్ వినూత్న నిర్ణయం సర్వత్రా అభినందనీయమని కొనియాడారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, గండిపాళెం గురుకుల పాఠశాలలో మెరుగైన వసతులు లభిస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. మరోసారి ఉదయగిరి నియోజకవర్గంలోని హాస్టళ్లలో మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి శోభారాణి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సుజాత, సంక్షేమ హాస్టళ్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *