విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సృజనాత్మకత మరియు సంసృతి సమితి బాషా (సంస్కృతిక శాఖ) మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తుమ్మల పల్లి వారి కేత్రయ్య కళాక్షేత్రంలో స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు, మండలి వెంకటకృష్ణారావు సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడారు.
ఈ కార్యక్రమం లో శాసనసబాపతి గౌరవ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. మండలి వెంకటకృష్ణారావు శతజయంతి సందర్భంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలను స్మరించుకున్నారు. దివిసీమ ఉప్పెన బాధితులకు ఆయన స్వయంగా సహాయం అందించి, ప్రజల హృదయాల్లో దేవుడిలా నిలిచారని గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, పూర్వ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి వంటి నాయకులు రాజకీయాల్లో చూపిన పట్టుదల, సమాజ శ్రేయస్సు పట్ల వారికున్న అంకితభావాన్ని కొనియాడారు.
తెలుగు భాషను కాపాడుకోవడం మన బాధ్యత అని శాసనసభలో ప్రతి ఎమ్మెల్యే కూడా తెలుగులోనే మాట్లాడాలని, తెలుగులో మాట్లాడితేనే మైక్ ఆన్ చేస్తానని సభాపతిగా నిబంధన విధించినట్లు తెలిపారు. అలాగే అసెంబ్లీకి రాకుండా ఉండే సభ్యులపై కూడా తగిన చర్యలు ఉండాలని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… మండలి వెంకటకృష్ణారావు సేవలను స్మరించుకున్నారు. జీవితాంతం తెలుగు భాషా వికాసానికి అంకితమైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవ్వడం ఎంతో సముచితమని, ఈ సభకు వన్నె తెచ్చిందని తెలిపారు.
తెలుగు భాషను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశ్వవ్యాప్తం చేయడానికి మొట్టమొదటి తెలుగు మహాసభలను నిర్వహించిన మహానుభావుడు మండలి వెంకటకృష్ణారావు అని మంత్రి కొనియాడారు. ఆయన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా సంఘానికి ఆయన పేరు పెట్టడం ఎంతో గౌరవప్రదమైన విషయమన్నారు. అలాగే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మండలి బుద్ధప్రసాద్ కూడా తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని శ్లాఘించారు. రాబోయే తరాల్లో తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచడంతో పాటు పద్య నాటకాలు, ఇతర కళారూపాలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
మండలి వెంకటకృష్ణారావు సేవలు, బహుముఖ ప్రజ్ఞాపాటవాలు చిరస్మరణీయం……
మంత్రి సత్యకుమార్ యాదవ్
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యులు సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ… మండలి వెంకటకృష్ణారావు బహుముఖ ప్రజ్ఞాపాటవాలు, వారి సుదీర్ఘ ప్రజాసేవ నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శనీయమని కొనియాడారు. కేవలం 15 ఏళ్ల పిన్న వయస్సులోనే మహాత్మా గాంధీ గారి పిలుపుతో ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొని స్వాతంత్య్ర సమరయోధుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ తర్వాత 26 ఏళ్ల వయస్సులోనే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రాజాజీ గారి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, బ్రిటిష్ కాలం నాటి మెకాలే విద్యా విధాన స్థానంలో భారతీయతను పెంపొందించేలా విద్యా వ్యవస్థలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు.
దివిసీమ ఉప్పెన విపత్తు సమయంలో వెంకటకృష్ణారావు ప్రజల మధ్యనే ఉంటూ నిరాడంబరంగా అందించిన సహాయక సేవలకు గాను ప్రజలు వారిని ‘దివిసీమ గాంధీ’గా గుండెల్లో నిలుపుకున్నారని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, జెడ్పీ ఛైర్మన్‌గా, వివిధ శాఖల మంత్రిగా ఏ బాధ్యత నిర్వహించినా దానికి పరిపూర్ణ న్యాయం చేశారని కొనియాడారు. అంతేకాకుండా తెలుగు భాషా పరిరక్షణకు, సాంస్కృతిక వికాసానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనదని… హైదరాబాద్ మరియు మలేషియాలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే తాటిపైకి తెచ్చారని మంత్రి గుర్తుచేశారు.
ఇటువంటి మహోన్నత నాయకుడి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా రూపుదిద్దిన మండలి బుద్ధప్రసాద్ కి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ శతజయంతి ఉత్సవాలకు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం ఎంతో శోభనిచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. మండలి వెంకటకృష్ణారావు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు భాషా సంస్కృతుల కోసం, ప్రపంచ తెలుగు మహాసభల కోసం కృషి చేసిన మహనీయుడు అని అన్నారు. ముఖ్యంగా దివిసీమ తుపాను సమయంలో ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అరుదైన నాయకుడు ఆయన అని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, తెలుగు భాష, సంస్కృతుల కోసం నిరంతరం శ్రమిస్తున్న బుద్ధప్రసాద్ కి, తనను ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు
శాసనసభ్యులు బొండా ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ… మండలి వెంకట కృష్ణారావు జయంతి ఉత్సవాల సందర్భంగా 1975లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి భాషకు విశేష సేవలు అందించారన్నారు.ఆయన సేవలకు గుర్తుగా అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరు పెట్టడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలిపారు.
1977 తుఫాను సమయంలో దివిసీమ ప్రజల కోసం ప్రాణాలకు తెగించి సేవలు అందించి ఆయన ‘దివిసీమ గాంధీ’ గా నిలిచిపోయారని గుర్తు చేశారు. ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆయనకున్న అపారమైన ప్రజాదరణకు నిదర్శనమని పేర్కొంటూ, వెంకట కృష్ణారావు గారి ఆశయ సాధనకు మరియు తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనసభ్యులు బొండా ఉమా మహేశ్వర రావు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మండలి వెంకటకృష్ణారావు భాషా సాంస్కృతిక సేవా పురస్కారాన్ని కేరళలోని కొచ్చిన్ కు చెందిన ఆంధ్ర సాంస్కృతిక సంఘం అధ్యక్షులు హరిహర నాయుడు కు ప్రదానం చేశారు. “అజాతశత్రువు – ఆదర్శనేత మండలి వెంకటకృష్ణారావు”, “కృష్ణా మండలి గేయ కావ్యం” పుస్తకాలను ఆవిష్కరించారు. అరవింద ఆర్ట్స్, తాడేపల్లి ఆధ్వర్యంలో “మహాపురుషుడు మండలి” నాటకాన్ని ప్రదర్శించారు.
కార్యక్రమంలో ఘనులు, భూగర్భ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) చైర్ పర్సన్ పొడపాటి తేజస్విని, సీఈవో మల్లిఖార్జున, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఇంచార్జీ వీసీ ప్రొఫెసర్ డి. మునిరత్నం నాయుడు, మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. త్రివిక్రమరావు (విక్రమ్ పూల), తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News