Breaking News

ఫిజియోథెరపీ విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు సవరించిన పాఠ్యాంశం

-జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏకరీతిగా అమలు చేయాలి: డా. ఎన్టీఆర్ యూహెచ్ఎస్
-విశ్వ విద్యాలయ గౌరవ ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిజియోథెరపీ విద్యలో నాణ్యతా ప్రమాణాలను మరింత పెంపొందించడంతో పాటు, విద్యార్థులకు ఆధునిక వైద్య అవసరాలకు అనుగుణమైన విద్యను అందించడమే లక్ష్యంగా నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ (NCAHP), న్యూఢిల్లీ రూపొందించిన సవరించిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ పాఠ్యాంశాన్ని రాష్ట్రంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డా. ఎన్టీఆర్ యూహెచ్ఎస్) సూచించింది.

సవరించిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ పాఠ్యాంశంపై మంగళవారం విజయవాడలోని డా. ఎన్టీఆర్ యూహెచ్ఎస్‌లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డా. టి. సాయి సుధీర్ సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన సవరించిన పాఠ్యాంశాన్ని అన్ని అనుబంధ ఫిజియోథెరపీ కళాశాలల్లో ఏకరీతిగా అమలు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచవచ్చన్నారు. విద్యార్థులకు ప్రస్తుత వైద్య రంగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, ప్రాక్టికల్ పరిజ్ఞానం అందేలా పాఠ్యాంశాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT) కోర్సును ప్రారంభించేందుకు విశ్వవిద్యాలయం తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఉపకులపతి తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులోకి రావడం ద్వారా ఫిజియోథెరపీ విద్య మరింత విస్తరించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

రిజిస్ట్రార్ డా. టి. సాయి సుధీర్ మాట్లాడుతూ, సవరించిన పాఠ్యాంశాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని అనుబంధ కళాశాలలు విశ్వవిద్యాలయంతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాఠ్యాంశ అమలులో ఎదురయ్యే సమస్యలను పరస్పర సమన్వయంతో పరిష్కరించుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో అదనపు డీఎంఈ (అకాడెమిక్) డా. వి. రాధికా రెడ్డి, డా. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ పరీక్షల నియంత్రణాధికారి డా. చి. శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ చైర్మన్ యలమంచిలి వెంకటేశ్వరరావు, కార్యదర్శి భీమ సుమిళ, పరిశోధన & అభివృద్ధి డైరెక్టర్ డా. ఎం. లక్ష్మీ సూర్యప్రభ, ప్రచురణల డైరెక్టర్ డా. కె. సుధ, జాయింట్ రిజిస్ట్రార్ (అకాడెమిక్) కె. నీలిమతో పాటు రాష్ట్రంలోని సుమారు 70 అనుబంధ ఫిజియోథెరపీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

సవరించిన పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలు, బోధనా విధానాలు, ప్రాక్టికల్ శిక్షణ, పాఠ్యాంశ అమలు విధానం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పాఠ్యాంశాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన పలు సూచనలు, సలహాలను అధికారులు, నిపుణులు అందించారు.

ఈ సందర్భంగా డా. వి. రాధికా రెడ్డి, యలమంచిలి వెంకటేశ్వరరావు, భీమ సుమిళలు సవరించిన పాఠ్యాంశం అమలుకు సంబంధించి తమ విలువైన సూచనలు అందించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ ఫిజియోథెరపీ కళాశాలల్లో సవరించిన పాఠ్యాంశాన్ని జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ప్రాక్టికల్ శిక్షణ అందించేందుకు సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *