Breaking News

అమరావతిలో కీలకమైన అభివృద్ధి పనులకు సీఆర్డీఏ అథారిటి అనుమతులు మంజూరు

-క్వాంటం ఫెసిలిటీ ప్రాజెక్టు టెండర్‌ దక్కించుకున్న L&T సంస్థ
-విజయవాడ నుండి అమరావతి టిటిడీ దేవస్థానం వరకు ఐకానిక్ రోప్ వే
-హ్యాపీనెస్ట్ కొనుగోలు దారులకు భారీ ఊరట
-కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి అధ్యాయనానికి అనుమతులు
-అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాలు రాష్ట్ర సంస్కృతి,సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్ణయం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి ప్రాంతంలో కీలకమైన పలు అభివృద్ధి పనులకు సీఆర్డీఏ అథారిటీ అనుమతులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పి‌.నారాయణ తెలిపారు. మంగళవారం ఏపి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 64వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదించిన నిర్ణయాలను సచివాలయంలో నాల్గవ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర 64వ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణం, మౌలిక వసతులు,సాంకేతిక అభివృద్ధి,పర్యాటక రంగానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రూ.1,280 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించనున్న క్వాంటం ఫెసిలిటీ ప్రాజెక్టు టెండర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ L&T (లార్సన్ అండ్ టూబ్రో) దక్కించుకోగా, ఈ ప్రతిపాదనకు అథారిటీ అధికారిక ఆమోదం తెలిపిందని వివరించారు.

రాజధాని అనుసంధానానికి అత్యంత కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి భూమి సేకరించాల్సి రాగా, గుంటూరు జిల్లా మోతడక గ్రామస్థులు ముందుకు వచ్చి తమ గ్రామంలోని 2,344 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేయడంపట్ల అథారిటీ హర్షం వ్యక్తం చేసి ఆమోదముద్ర వేసిందన్నారు.

విజయవాడ నగరంలో ట్రాఫిక్ రహిత రవాణాతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ నుండి పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ (PNBS) వరకు, బస్టాండ్ నుండి ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వరకు, దుర్గమ్మ గుడి వద్ద నుండి కృష్ణా నది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్ వరకు అక్కడి నుండి భవాని ఐలాండ్ వరకు అక్కడి నుండి అమరావతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాయం వరకు ఐకానిక్ రోప్‌వే ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నామన్నారు.

డిజిటల్ మౌలిక వసతులను వేగవంతం చేసేందుకు 20 మెగావాట్ల బృహత్తర సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు టెండర్లు పిలవడంతో పాటు, నగరమంతటా హై-స్పీడ్ నెట్‌వర్క్ అందించేందుకు 20 ప్రధాన ప్రాంతాల్లో 5G టవర్ల ఏర్పాటుకు నివేదికల (RFP) ఆహ్వానానికి సమ్మతించడం హర్షనీయమని మంత్రి నారాయణ పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో పక్కనపెట్టిన ‘హ్యాపీనెస్ట్’ హౌసింగ్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిన నేపథ్యంలో ఆలస్యం వల్ల కొనుగోలుదారులపై అదనపు భారం పడకుండా ఏపీ రేరా (AP RERA) రెన్యూవల్ ఫీజు నుండి మినహాయింపును ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు.

రాజధాని పరిధిలోని పల్నాడు జిల్లా పరిధిలో ఉన్న 244.39 ఎకరాల దేవాదాయ భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తెస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం దేవాదాయ శాఖకు చెల్లించాల్సిన రూ. 122 కోట్ల నిధులను సీఆర్డీఏ నుండి విడుదల చేయడానికి అనుమతి లభించిందన్నారు. రైతు ప్రయోజనాలే ధ్యేయంగా గతేడాది రైతులకు చెల్లించిన రూ.300 కోట్ల యాన్యుటీ బకాయిల నిమిత్తం APPFC కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణ ప్రక్రియకు అథారిటీ రెక్టిఫికేషన్ ఆమోదం తెలిపిందన్నారు.

అమరావతిలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపుపై చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ,రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదానికి పంపనున్నామన్నారు. అమరావతి-విజయవాడ నగరాల మధ్య భవిష్యత్ ప్రయాణ,సరుకు రవాణా అవసరాల కోసం కృష్ణా నదిపై ఎన్ని బ్రిడ్జీలు అవసరం అలాగే అత్యంత ఆధునిక సాంకేతికత తో కూడిన ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ప్రత్యేక కన్సల్టెంట్‌ను నియమించనున్నామని చెప్పారు.

భోగాపురం విమానాశ్రయం తరహాలోనే అమరావతిలోని ప్రభుత్వ భవనాలు, ప్రాజెక్టులలో తెలుగు సంస్కృతి, కళలు, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపకల్పన చేయడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని అథారిటీ సమావేశం లో నిర్ణయించినట్టు మంత్రి నారాయణ మీడియాకు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *