గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కళలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని, కళాకారులు జాతి సంస్కృతికి ప్రతిబింబాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
శనివారం నగరంలోని విద్యానగర్, గుజ్ఙనగుండ్ల రోడ్డు వద్ద రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనను జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు , రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ డిప్యుటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, సంస్థ ఛైర్ పర్సన్ తేజస్వి పొడపాటి తోడురాగా కేంద్ర మంత్రి ప్రారంభించారు. దేశ నలుమూలల నుండి దాదాపు 700 మంది వివిధ కళాకారులు తమ చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ కళ కేవలం నాలుగు గోడల మధ్యే కాకుండా, వీధులనే ఒక విశాలమైన వేదికగా మార్చి, కళాకారులను ప్రజలకు పరిచయం చేయడం అభినందనీయమన్నారు. దేశనలుమూలల నుండి దాదాపు 700 మంది కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, శిల్ప, జానపద, సంప్రదాయ మరియు ఆధునిక కళారూపాలను ప్రదర్శించడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రతీ ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందని, దానిని వెలికితీసినప్పుడే ఆనందం వారి సొంతమవుతుందని పేర్కొన్నారు. గుంటూరు ప్రజలందరూ సాయంత్రం వేళల్లో కుటుంబసమేతంగా వచ్చి ఈ కళాప్రదర్శనలను తిలకించి, కళాకారులను ప్రోత్సహించాలని కోరారు.
జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు , రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆర్ట్ గ్యాలరీలకు పరిమితమైన చిత్ర కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప వేదిక అమరావతి చిత్ర కళా వీధి అని వివరించారు. అనితర సాధ్యమైన ప్రతిభతో తమ కళారూపాలతో విచ్చేసిన కళాకారులకు, వాటిని ఆదరిస్తున్న రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులకు తన నమస్సుమాంజలి తెలియజేస్తున్నానన్నారు. ఇది ఒక ప్రత్యేకతతో కూడినటువంటి కార్యక్రమమని ఆ నాలుగు గోడల్ని ఛేదించుకుని, బయటకి వచ్చి, తమ ప్రతిభని ప్రదర్శించేటువంటి అవకాశం, పది మంది వాటిని చూసి, ఆస్వాదించేటువంటి అవకాశం, తద్వారా కళాకారుడు తన్మయత్వం చెందేటువంటి అవకాశం ఇలాంటి చిత్రకళా వీధి ద్వారా మాత్రమే సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి, మొట్టమొదటగా కళలకు కాణాచి అయినటువంటి రాజమహేంద్రవరంలో ప్రదర్శించామని, రెండవదిగా రాజకీయ చైతన్యానికి మారుపేరైన గుంటూరులో నిర్వహిస్తున్నామన్నారు. ప్రాచుర్యానికి నోచుకోని అద్భుతమైనటువంటి కళాకారులు ఈ రాష్ట్రంలో ఎందరో ఉన్నారని, వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, వాళ్ళ ప్రతిభ ప్రదర్శించుకునే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు కళలకు కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉందన్నారు. కళాకారులను గౌరవించే ప్రభుత్వం తమదని, కనుకనే ఉగాది పురస్కారాలు, కళారత్న పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు, నాటక పురస్కారాలను పునరుద్ధరించామన్నారు.
శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ కళాకారుల్లోని సృజనాత్మక శక్తిని ప్రజలందరికీ తెలిసే విధంగా చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. ఇక్కడికి వచ్చిన కళాకారుల్లో అడవి బాపిరాజు , బాపు, కోట వైకుంఠం, ఏలే లక్ష్మణ్ లాంటి ఎంతో గొప్ప గొప్ప కళాకారులు భవిష్యత్తులో రావచ్చునన్నారు.అటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న కళాకారులందరికీ, ఇటువంటి వేదిక ఏర్పాటు చేసిన సాంస్కృతిక శాఖకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తునన్నారు. ప్రభుత్వ తోడ్పాటు ఉంటే కళాకారులు చాలా అద్భుతంగా రాణించే అవకాశం మరింత పెరుగుతుందని, రాబోయే రోజుల్లో మరింత మంది కళాకారులు ఇందులో పాల్గొని, ఇతరులందరికీ కూడా కళల పట్ల ఆసక్తి కలిగించే విధంగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు , పొన్నూరు శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు, గళ్ళా మాధవి, నజీర్ అహ్మద్, ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ, రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ, రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యా రావు, గుంటూరు మున్సిపల్ కమీషనర్ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News