గురువులపై దాడులు బరితెగింపే

-ఉపాధ్యాయులపై గొడ్డలి పార్టీ దాడులపై చర్యలు తీసుకుంటాం
-నియామక ప్రక్రియపై అభ్యంతరాలుంటే కోర్టులకు వెళ్లొచ్చు… దాడులు చేయడమేంటీ.?
-డీఎస్సీ నియామకాలపై చర్చకు అసెంబ్లీకి వస్తే సాక్ష్యాలతో సమాధానం చెబుతాం
-కుక్క తోక వంకర తీరులా గొడ్డలి పార్టీ వ్యవహారం
-కుప్పం బహిరంగ సభలో వైసీపీపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయులపై దాడులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు. గురువులపై గొడ్డలి పార్టీ దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో అసెంబ్లీకి వచ్చి చర్చించాలని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని అన్నారు. అలా కాకుండా ఉపాధ్యాయులపై దాడులకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. కుప్పంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలు కష్టార్జితమని స్పష్టంగా చెబుతున్నారని సీఎం అన్నారు. స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయులు తమపై చేస్తున్న ఆరోపణలను నిరసిస్తూ విజయవాడలో ఆందోళనకు దిగారని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించి, నిబంధనల ప్రకారం ఉద్యోగాలు పొందిన వారినే ఇప్పుడు ఫేక్‌ అంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం మరింత దారుణమని సీఎం పేర్కొన్నారు. గురువులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం… చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు. మీడియా ముసుగులో కుప్పంలో వైసీపీ అనుకూల రిపోర్టర్‌ ఉపాధ్యాయుడిపై దాడి చేశారన్న అంశాన్ని ప్రస్తావిస్తూ… ఇలాంటి ఘటనలు ఎంతవరకు వెళ్లాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆర్మీలో పనిచేసిన వ్యక్తి క్రీడా ప్రతిభ ఆధారంగా టీచర్‌ ఉద్యోగం పొందితే అతనిపైనా దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమను ఫేక్‌ అంటూ అవమానించడాన్ని ప్రశ్నించినందుకు రౌడీలతో దాడులు చేయడం ఏమిటని ముఖ్యమంత్రి నిలదీశారు.

డీఎస్సీకి ఇదే మా ట్రాక్‌ రికార్డు

తన హయాంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో అవినీతికి, ప్రశ్నపత్రాల లీకేజీలకు తావులేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నో డీఎస్సీలు, ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించామని, ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని చెప్పారు. తన పాలనా కాలంలో 14 సార్లు డీఎస్సీ నిర్వహించినట్లు తెలిపారు. చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా నియామకాలు చేపట్టడమే తమ ట్రాక్‌ రికార్డు అని అన్నారు. మెగా డీఎస్సీ – 2025 నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు 355 పిటిషన్లు దాఖలయ్యాయని, అయినప్పటికీ చట్టబద్ధంగా, పారదర్శకంగా నియామకాలు పూర్తి చేశామని సీఎం తెలిపారు. నియామకాలు పూర్తై ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఉద్యోగాలు పొందినవారిని గత ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెేట్ల ఆధారంగా నియమించిన విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. క్రీడల్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ఇచ్చింది గత ప్రభుత్వమేనని, ఆ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారిని ప్పుడు ఫేక్‌గా పేర్కొనడం విచిత్రంగా ఉందని అన్నారు.

దుష్ప్రచారానికి టీచర్లే సమాధానం చెప్పారు

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు ఉపాధ్యాయులే వివిధ ప్రాంతాల్లో స్పందించారని సీఎం తెలిపారు. కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం, విశాఖ సముద్రతీరం వద్ద తమ ఉద్యోగాలు ప్రతిభ, కష్టార్జితమని ఉపాధ్యాయులు స్పష్టం చేశారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే వచ్చిన ఆరోపణలకు సమాధానాలు ఇచ్చిందని, ఇద్దరు మహిళా అధికారులు కూడా ఈ అంశంపై వివరంగా స్పందించారని తెలిపారు. ఆరోపణలు చేసే వారికి వాస్తవాలు తెలుసుకోవాలంటే అసెంబ్లీకి రావాలని సూచించారు. సాక్ష్యాధారాలతో సమాధానం చెబుతాం.. వాస్తవాలతో వివరిస్తామని, ఆధారాలతో అబద్దాలాడే వారి బట్టలూడదీస్తాం అని సీఎం స్పష్టం చేశారు. నియామక ప్రక్రియపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాలను అనుసరించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉన్నప్పుడు ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియపై అవసరమైతే కోర్టులకు వెళ్లొచ్చు.. కానీ దాడులేంటి? ఉపాధ్యాయులపై రౌడీలను ఎగదోయడమేంటి? డీఎస్సీ నియామకాలపై రాజకీయ రౌడీయిజం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ఉపేక్షించం

2019–24 మధ్య రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని చంద్రబాబు విమర్శించారు. అప్పటి పాలకులే రౌడీయిజానికి పాల్పడి, దౌర్జన్యాలకు దిగారని ఆరోపించారు. కుప్పం వచ్చిన సందర్భాల్లో తనను కూడా ఇబ్బందులకు గురిచేసేందుకు గొడ్డలి పార్టీ నేతలు ప్రయత్నించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా హింసాత్మక ధోరణులు కొనసాగిస్తున్నారని సీఎం ఆరోపించారు. రౌడీయిజం చేసే వారి తోక కత్తిరిస్తాం అని హెచ్చరించారు. విధ్వంసక చర్యలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. రాజకీయ ముసుగులో రౌడీలు ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలకు పొట్టేళ్లను బలి ఇచ్చి రక్తాభిషేకాలు చేయడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో రాజకీయాలను హింస, దౌర్జన్యాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిని గతంలో స్మశానంగా అభివర్ణించినవారు ఇప్పుడు అది అభివృద్ధి చెందుతుండటాన్ని చూడలేక కుట్రలకు పాల్పడుతున్నారని సీఎం ఆరోపించారు. జే బ్రాండ్స్‌, ఏపీపీఎస్సీ వ్యవహారాలపై కూడా ధైర్యంగా సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో రాజకీయ ముసుగులో రౌడీయిజానికి తావులేదని, ఆ ప్రక్రియ కుప్పం నుంచే మొదలుకావాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీఎం ప్రజలను కోరారు. ప్రతి వార్డు, ప్రతి పంచాయతీలో కూటమి అభ్యర్థులే గెలవాలని ఆకాంక్షించారు. అదే అభివృద్ధికి సూచికగా నిలుస్తుందని సీఎం అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *