అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమమధ్య, ఆనుకొని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండంగా బలపడి, ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
మంగళవారం(22-09-26) అల్లూరి, పోలవరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బుధవారం (23-09-26) అల్లూరి, పోలవరం,ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
గురు,శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి కాకినాడ జిల్లా శంఖవరంలో 60.7 మిమీ, ఎన్టీఆర్ జిల్లా నందలూరులో 52.5మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 48.2మిమీ, నంద్యాల జిల్లా దుర్వేసిలో 45.5మిమీ, ఎన్టీఆర్ జిల్లా కవులూరులో 45.3మిమీ,చిత్తూరు జిల్లా రామకుప్పంలో 39.3మిమీ, అనంతపురం జిల్లా డి.హీరేహాల్ 35.5మిమీ, కర్నూలు జిల్లా పత్తికొండలో 31.5 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
Prajavartha Online Telugu News