-మెగా డీఎస్సీ నియామకాలపై ప్రతి ఆరోపణకూ ఆధారాలతో సమాధానం ఇస్తాం: మంత్రి వాసంశెట్టి సుభాష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కష్టపడి చదివి, క్రీడల్లో ప్రతిభ చాటి, నిబంధనల ప్రకారం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన వారిని ‘ఫేక్’ అంటూ అవమానించడం సరికాదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వేలాది మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం తగదని పేర్కొన్నారు.
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రి స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరాలుంటే చట్టబద్ధ మార్గాల్లో నిరసన తెలియజేయవచ్చని అన్నారు. అయితే నిరసనలు భౌతిక ఘర్షణలకు దారితీయకూడదని స్పష్టం చేశారు. ఘటనలో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మెగా డీఎస్సీ.. పారదర్శక నియామక ప్రక్రియ
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో నోటిఫికేషన్ నుంచి పరీక్షలు, ఆన్సర్ కీలు, మెరిట్ జాబితాలు, అభ్యంతరాల స్వీకరణ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, తుది ఎంపిక వరకు నిర్దేశిత విధానాలను అనుసరించినట్లు మంత్రి తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉపాధ్యాయ నియామకాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను 148 రోజుల్లో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ నియామకాలు వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు, ఆర్థిక భరోసాను కల్పించాయని అన్నారు.
నియామక ప్రక్రియపై ఎవరికైనా నిర్దిష్ట అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆధారాలను అధికారుల ముందుంచాలని సూచించారు. ప్రతి అభ్యర్థి అర్హతను నిబంధనలు, అధికారిక రికార్డుల ఆధారంగా పరిశీలించే వ్యవస్థ ఉందని, తప్పు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల గౌరవాన్ని దెబ్బతీయొద్దు
స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ.. నిర్దిష్ట ధ్రువపత్రాలపై అనుమానాలుంటే వాటిని అధికారికంగా పరిశీలించవచ్చని మంత్రి అన్నారు. అయితే ఆధారాలు లేకుండా మొత్తం స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన అభ్యర్థులందరినీ ‘ఫేక్’గా చిత్రీకరించడం సమంజసం కాదని స్పష్టం చేశారు.
సంబంధిత అధికారులు కూడా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, టెట్ అర్హత, ఇతర ధ్రువపత్రాలను అధికారిక రికార్డుల ఆధారంగా వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.
క్రీడల్లో ప్రతిభ కనబరిచి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఒక నిర్దిష్ట అంశంపై అనుమానం ఉంటే దానిని పరిశీలించాలి కానీ, దాని ఆధారంగా మొత్తం నియామక ప్రక్రియను అనుమానాస్పదంగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.
విజయవాడ ఘటనపై చట్టప్రకారం చర్యలు
శాప్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా విభేదాలు, వాదోపవాదాలు సహజమే అయినా అవి శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని అన్నారు.
“మేము చదువుకున్నాం.. కష్టపడ్డాం.. నిబంధనల ప్రకారం ఉద్యోగాలు సాధించాం.. మా ఉద్యోగం మా కష్టార్జితం” అని ఉపాధ్యాయులు చెబుతున్నప్పుడు వారి వాదనను కూడా వినాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఉపాధ్యాయులు సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే వారని, వారే రాజకీయ ఘర్షణల్లో బాధితులుగా మారే పరిస్థితి రావడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి వాస్తవాలను పరిశీలించి, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గ్రూప్-1 వ్యవహారంపై వాస్తవాలు వెలుగులోకి రావాలి
గత ప్రభుత్వ హయాంలో జరిగిన APPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకన ప్రక్రియపై SIT సమర్పించిన నివేదికలో పలు విధానపరమైన లోపాలు, దిద్దుబాట్లు, సంతకాలలో వ్యత్యాసాలు వంటి అంశాలు నమోదైనట్లు మంత్రి పేర్కొన్నారు.
SIT పరిశీలించిన 736 రికార్డుల్లో 718 రికార్డుల్లో మార్పులు లేదా ఓవర్‌రైటింగ్ ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అదే సమయంలో, ఎంపికైన అభ్యర్థుల అసలు జవాబు పత్రాలు మార్చబడినట్లు లేదా తారుమారు చేసినట్లు SIT నిర్ధారించలేదని తాజా కోర్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల ఈ అంశంపై వాస్తవాలను కోర్టు పరిధిలోనే తేల్చాల్సి ఉందని మంత్రి అన్నారు.
నియామక పరీక్షల విషయంలో పారదర్శకత అత్యంత కీలకమని, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రతి నియామక ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని వాసంశెట్టి సుభాష్ అన్నారు.
“ఉపాధ్యాయుల కష్టాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు. ఆరోపణలు ఉంటే ఆధారాలు చూపాలి.. విచారణ కోరాలి.. చట్టబద్ధమైన మార్గాల్లో ముందుకు వెళ్లాలి. కానీ కష్టపడి ఉద్యోగం సాధించిన వారి గౌరవాన్ని దెబ్బతీయడం మాత్రం సమర్థనీయం కాదు” అని మంత్రి స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News