-ప్రకృతి సేద్యమే శ్రీరామరక్ష
-ప్రతి ఇంటినీ ఆర్థికంగా బలోపేతం చేస్తాం… కుప్పం అభివృద్ధికి కొత్తఊపు తెస్తాం
-కుప్పంలో రూ.327 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు భూమిపూజ, శంకుస్థాపనలు
-నీరు… పరిశ్రమలు… ఉపాధి… సౌర విద్యుత్… స్వర్ణ కుప్పం దిశగా సీఎం ప్రణాళిక
కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
నారావారిపల్లె తనకు జన్మనిస్తే… కుప్పం రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా, స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు. గడచిన రెండేళ్లలో రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కుప్పం నుంచే ఏ పని చేయాలన్నా నాంది పలుకుతామని చెప్పారు. కుప్పంలో సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.327 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీటిని తీసుకువచ్చి 133 చెరువులను నింపగలిగామని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని 550కుపైగా చిన్న నీటిపారుదల చెరువులను లిఫ్ట్ ఇరిగేషన్, పైప్లైన్లతో అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. యామిగానిపల్లి, మనపల్లి ప్రాంతాల్లో రిజర్వాయర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. బీరువానిపల్లి వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా రూ.45 కోట్లతో రిజర్వాయర్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. పశుదాణాకు ఇబ్బంది లేకుండా కూడా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని సీఎం తెలిపారు. కృష్ణా, గోదావరి నదులకు ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడంతో నీటి లభ్యతపై ఒత్తిడి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు అధికంగా రసాయన ఎరువులు వినియోగించకుండా ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ పంటలు, సూక్ష్మ సాగునీటి విధానాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రకృతి సేద్యమే శ్రీరామరక్ష అనే విధానంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సేంద్రీయ ఎరువుల వినియోగం, బయోచార్ వంటి విధానాలతో భూమిలో సారం, తేమ పెంచడంతో పాటు జీవవైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచాలని చెప్పారు. పీఎండీఎస్ విధానం ద్వారా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, భూములను ఖాళీగా ఉంచకుండా సాగులోకి తీసుకురావాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే చిరుధాన్యాలతో పాటు పశుపోషణ, పౌల్ట్రీ, ఉద్యాన పంటలపై దృష్టి పెడితే రైతులు, మహిళలకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు.
ప్రతి ఇంటిపైనా సోలార్ రూఫ్‌టాప్
కుప్పాన్ని నెట్‌జీరో నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు సహా అన్ని భవనాలు నెట్‌జీరో దిశగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటిపైనా సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసి.. ప్రతి ఇల్లూ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారేలా చర్యలు చేపడతామని చెప్పారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన పీఎం-కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కుప్పంలో 8,904 బంగారు కుటుంబాలను గుర్తించి పీ4 కార్యక్రమం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని సీఎం తెలిపారు. కుప్పాన్ని పేదరికం లేని నియోజకవర్గంగా మార్చడమే లక్ష్యమన్నారు. టీవీఎస్, అదానీ, మెగా తదితర సంస్థలు 8,900కుపైగా కుటుంబాలను దత్తత తీసుకుని వాటి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు తయారవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కుప్పంలో ఇప్పటికే 32 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, వాటి ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు లభించేలా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. బిర్లా ఇన్స్టిట్యూట్తో పాటు మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా కూడా నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు.
కుప్పం అభివృద్ధికి భారీ ప్రణాళిక
రెండు నెలల క్రితం కుప్పంలో రూ.7,939 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని సీఎం గుర్తుచేశారు. తాజాగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రూ.38 కోట్ల విలువైన ప్రభుత్వ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. మరో రూ.289 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా భూమిపూజ నిర్వహించినట్లు చెప్పారు. కుప్పంలో ఎక్కడా చెత్త కనిపించకుండా పారిశుధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యమని సీఎం తెలిపారు. 82 ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా చెత్త నుంచి కంపోస్టు తయారు చేస్తున్నామని చెప్పారు. రూ.3.30 కోట్లతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, మెటీరియల్ రికవరీ సెంటర్‌ను ప్రారంభించారు. రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.2.70 కోట్లతో చేపట్టనున్న మల్లనూరు జూనియర్ కళాశాల పనులకు భూమిపూజ చేశారు. కుప్పం మార్కెట్ యార్డులో రూ.2.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో హైమాస్ట్ వీధి దీపాలు, పబ్లిక్ టాయిలెట్లు, అండర్‌గ్రౌండ్ యుటిలిటీ వ్యవస్థ, బీటీ, సీసీ రోడ్లు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. స్థానిక ఉత్పత్తుల విక్రయానికి ఆధునిక రైతు బజార్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
కుప్పం కనెక్టివిటీకి పెద్దపీట
కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచేలా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఆ సౌకర్యాన్ని కల్పించామని సీఎం తెలిపారు. బెంగళూరు, చెన్నై, కేజీఎఫ్, కృష్ణగిరి ప్రాంతాలను అనుసంధానించేలా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందన్నారు. కుప్పం-పొగురుపల్లి నుంచి బెంగళూరుకు ప్రత్యామ్నాయ రహదారి నిర్మిస్తున్నామని చెప్పారు. చిత్తూరు నుంచి కుప్పానికి బ్రాడ్‌గేజ్ రైలు మార్గం కల్పించాలని రైల్వే శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. కుప్పంలో ఉత్పత్తయ్యే వస్తువులు కృష్ణపట్నం పోర్టుకు చేరేలా కనెక్టివిటీని మరింత పెంచుతున్నామని చెప్పారు. భవిష్యత్తులో కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు చేపడతామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా పౌరుల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పంలో ఇప్పటికే వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ హెల్త్ రికార్డులు నమోదు చేసి చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. 13 పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల ద్వారా 1.29 లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ఆరోగ్యాన్ని పరిరక్షించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా ఇల్లు, ఇంటి స్థలం అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కంగుందిలో దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యను పరిష్కరించి 320 మందికి పట్టాలు అందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో మీ భూమి–మీ హక్కు కార్యక్రమం ద్వారా రాజముద్రతో కూడిన పట్టాలు జారీ చేస్తున్నామని చెప్పారు.
ప్రజలతో ముఖాముఖి… అభివృద్ధిపై అభిప్రాయాలు
కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి రైతులు, గృహిణులు, ఉద్యోగులు, యువత, వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. హంద్రీనీవా కాలువ ద్వారా అందుతున్న నీటితో కలుగుతున్న ప్రయోజనాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పీ4 కార్యక్రమం ద్వారా లభించిన ప్రయోజనాలపై లక్ష్మి అనే మహిళతో మాట్లాడారు. ఇటుకల బట్టీ ఏర్పాటు చేసుకునేందుకు సహకరించి తనను మహిళా పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దినందుకు సీఎంకు, టీవీఎస్ సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కుప్పంలోని ఓ పరిశ్రమలో ఉద్యోగం పొందిన సురేఖ అనే యువతిని ముఖ్యమంత్రి అభినందించారు. కుప్పం మెడికల్ కాలేజీ తన తండ్రి ప్రాణాలను కాపాడిందని యువ పారిశ్రామికవేత్త సుబ్రహ్మణ్యం తెలిపారు. కుప్పం అభివృద్ధిలో ప్రతి రోడ్డు, ప్రతి నీటి చుక్కలోనూ ముఖ్యమంత్రి కనిపిస్తున్నారని ఓ యువకుడు పేర్కొన్నారు. కుప్పంలో ఉత్పత్తయ్యే ఆర్గానిక్ ఉత్పత్తులను రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నట్లు మరో యువకుడు వివరించారు. హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్లో నీటి ప్రవాహాన్ని లైవ్ వీడియో ద్వారా సభకు చూపించారు. కుప్పం అభివృద్ధిపై కడా నిర్వహించిన వీడియో కాంటెస్టులో విజేతలైన సుబ్రహ్మణ్యం, విక్కీలను సీఎం సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, కుప్పం స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News