పచ్చదనం పరిమళం.. పీఠికాపుర వనం ఆవిష్కారం

-నగర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద రూ. 1.83 కోట్లతో నిర్మాణం
-ఆహ్లాదం, ఆధ్యాత్మికతల కలబోతగా పిఠాపురం నగర వనం
-ప్రత్యేక ఆకర్షణగా నక్షత్ర వనం, శివ పంచాయతన వనం
-70 సెంట్ల విస్తీర్ణంలో మియావకీ ప్లాంటేషన్‌ను ఆసక్తిగా తిలకించిన ఉప ముఖ్యమంత్రి
-⁠ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 నగరవనాలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్

పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
పిఠాపురం పట్టణ, నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంతోపాటు, పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన ‘పీఠికాపుర వనం’ నగర వనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం నగర వనంలో మొక్క నాటి, పీఠికాపురవన ప్రారంభ సూచకంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద సుమారు రూ. 1.83 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ నగరవనం పిఠాపురం పట్టణానికి సరికొత్త హరిత సొబగులను అద్దింది. గతంలో పూర్తిగా డంపింగ్ యార్డుగా, అపరిశుభ్రతకు నెలవుగా ఉన్న ప్రాంతం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నేడు పచ్చదనపు పరిమళాలు వెదజల్లుతూ, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే నగరవనంగా మారింది.
పిఠాపురంకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నగరవనంలో ఆహ్లాదం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా తీర్చిదిద్దారు. అందులో ముఖ్యంగా నక్షత్రవనం, శివపంచాయతన వనం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అటవీ శాఖ అధికారులు ఈ రెండింటి ప్రాధాన్యతను పవన్ కళ్యాణ్ కి వివరించారు. 27 నక్షత్రాలకు ప్రతీకగా నిలిచే ఉసిరి, మేడి, మోదుగ, కొండమామిడి, పిప్పలి, వెదురు, రావి, మర్రి, జాతి జువ్వి, దేవదారు, పసన, జిల్లేడు, జమ్మి, విప్ప, వేప తదితర రకాల మొక్కలను ఒక వరుస క్రమంలో నాటగా, ప్రతి మొక్కను ఉప ముఖ్యమంత్రివర్యులు ఆసక్తిగా తిలకించారు. శివ స్వరూపమైన మారేడుతో పాటు వినాయకుడు, విష్ణువు, అమ్మవారు, సూర్యభగవానుడి స్వరూపాలైన మొక్కలను శివ పంచాయతనంగా ఏర్పాటు చేశారు. కార్తీక మాసంతోపాటు ప్రత్యేక దినాల్లో ఈ మొక్కలకు ప్రదక్షిణ చేయడం ద్వారా ఆయా దేవతల ప్రదక్షిణ పుణ్యం ప్రాప్తిస్తుందని వివరించారు. ప్రతి మొక్కకు శాస్త్రీయ నామం, వాడుకలో ఉన్న పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు.
అనంతరం 70 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మియావకీ ఫారెస్ట్ ప్లాంటేషన్‌ను, బటర్‌ఫ్లై పార్కును, నగరవనం మధ్యన ఉన్న భారీ కొలనును ఉప ముఖ్యమంత్రివర్యులు తిలకించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను పెంచుతూ వేగంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసే విధంగా మియావకీ పద్ధతిలో చిట్టడవిని నాటారు. బాక్స్ క్రికెట్, ప్లే కోర్ట్స్ లాంటి మరిన్ని ఆకర్షణలు నగరవనానికి జోడించనున్నారు. పిఠాపురం ప్రజలతోపాటు ఆధ్యాత్మిక సందర్శనార్థం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా మరింత సర్వాంగ సుందరంగా నగర వనాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం గతంలో డంపింగ్ యార్డుగా ఉన్నప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉండేది? దాన్ని ఎంత కష్టపడి నగరవనంగా తీర్చిదిద్దారో వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిలకించారు. ఈ సందర్భంగా పీఠికాపుర వనాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు.
కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో నగర వనాలు అభివృద్ధి చేస్తున్నారు. రూ. 36 కోట్లతో ఏర్పాటు చేసిన 18 నగర వనాలను ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్  కళ్యాణం శివశ్రీనివాస్, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, కౌడా ఛైర్మన్ తలాటం సత్య, రాష్ట్ర అటవీ శాఖ ఐటీ సలహాదారు పెన్నమరెడ్డి నాగబాబు, పడా పీడీ శివరాం ప్రసాద్, సీసీఎఫ్ జ్యోతి, కాకినాడ డీఎఫ్ఓ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సోషల్ మీడియా రంగ అభివృద్ధికి భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : MOU మార్పిడి కార్యక్రమం అనంతరం సోషల్ మీడియా ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *