Breaking News

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. విద్యుత్ శాఖ అప్రమత్తం

-సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలి
-గత అనుభవాలతో ముందస్తు చర్యలు చేపట్టాలి
-ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో వర్షాల పరిస్థితి, విద్యుత్ సరఫరా, క్షేత్రస్థాయిలో చేపట్టిన ముందస్తు చర్యలపై బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

గతంలో భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిని పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించే విధానం కాకుండా, పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

వర్షాలు రైతులకు, ప్రజలకు ఆనందదాయకమైన పరిణామమే అయినప్పటికీ భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా లోతట్టు, తీర ప్రాంతాలతో పాటు గతంలో విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ

ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన సిబ్బంది, వాహనాలు, పరికరాలు, అదనపు విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రజలకు ప్రమాదం జరగకుండా భద్రతా చర్యలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. వర్షాలు కొనసాగుతున్న సమయంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ముందుగానే సమాచారం అందించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, అనివార్యంగా అంతరాయం ఏర్పడిన చోట సాధ్యమైనంత తక్కువ సమయంలో సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.

టెలికాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లాల ఎస్‌ఈలు, ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *