-అర్హులైన పిల్లలందరికీ వారి తల్లితండ్రులు బాధ్యత తీసుకొని టీకా వేయించాలి…
-జిల్లాలో టీకా వేసేందుకు 2.02 లక్షల మంది పిల్లలను గుర్తించాం…
-పాఠశాలల ఉపాధ్యాయులు, కళాశాలల ప్రిన్స్ పాల్స్ పిల్లల తల్లితండ్రులకు కోవిడ్ టీకా పై అవగాహన కల్పించాలి…
-జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ నెల 3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు 15 నుంచి 18 సంవత్సరాలు వయస్సు గల పిల్లలందరికీ సమీప సచివాలయాల్లో, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కోవిడ్ టీకా కోవాగ్జిన్ వేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివశంకర్ అన్నారు.
ఆదివారం స్థానిక జాయింట్ కలెక్టరు క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్యాధికారులతో జాయింట్ కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు ఎల్. శివశంకర్ మాట్లాడుతూ జిల్లాలో 15 నుంచి 18 సంవత్సరాలు వయస్సు గల యువతీ యువకులందరికీ 3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు వారి సమీపంలో గల సచివాలయాల్లో, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కోవిడ్ టీకా కోవాగ్జిన్ వేయడం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు అర్హులైన వారి పిల్లలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయా కేంద్రాలకు తీసుకువచ్చి కోవిడ్ టీకాలను ఇప్పించి సహకరించాలన్నారు. కోవిడ్ టీకా తీసుకునే వారు తప్పనిసరిగా ఆహారం భుజించి రావల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 2.02 లక్షల మంది పిల్లలు కోవిడ్ టీకా తీసుకునేందుకు అర్హత కలిగియున్నారన్నారు. అపోహలకు తావులేకుండా టీకాలు వేయించుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాఠశాలల ఉపాధ్యాయులు, కాలేజీ ప్రిన్సిపాల్స్ పిల్లల తల్లితండ్రులను సమన్వయపరచుకొని అర్హులయిన వారిరందరికి టీకా వేయించే విధంగా బాధ్యతాయుతంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 36.05 లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ మొదటి మోతాదు అందించారని, 28.15 లక్షల మందికి రెండో డోస్ వేయడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా రెండో డోస్ వేయించుకోని వారు ఉంటే ఆయా గ్రామ/వార్డు సచివాలయాల్లో లేదా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేయించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రజలకు వాలంటీర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారన్నారు. ఈ నెల 10 వ తేదీ నుంచి హెల్త్ కేర్ వర్కర్లు, ప్రంట్ లైన్ వర్కర్లతో పాటు 60 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వీరికి ఫికాషన్ డోస్(బూస్టర్ డోస్) వేయడం జరుగుతుందన్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకుని తొమ్మిది మాసాలు పూర్తయినవారికి మాత్రమే వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమెదు కానప్పటికీ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందకుండా రక్షణ పొందేందుకు విధిగా వ్యాక్సిన్ వేయించుకొని అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టరు శివశంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో జిల్లా వైద్యాధికారిణి డా. యం. సుహాసిని, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. సర్మిష్ట, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News