Breaking News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ

-సమాజంలో మార్పు విద్యతోనే సాధ్యం..
-మైనారిటీల విద్యపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
-సమీక్షా సమావేశంలో నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ సభ్యురాలు సయద్ షాహేజది.

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను లక్ష్యాల మేరకు ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేనని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్ సభ్యురాలు సయద్ షాహేజది తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి కొత్త 15 పాయింట్ల కార్యక్రమం పై విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్ లోని రైతు శిక్షణ కేంద్రంలో ఆమె రాష్ట్రంలోని జిల్లా మైనార్టీస్ వెల్ఫేర్ అధికారులు, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఆడిటర్స్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల వారీగా మైనారిటీ సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి పనులు, వసతుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వివరాలను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. మైనారిటీల సంక్షేమం కోసం కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అధికారులందరూ పనిచేయాలన్నారు.
సయద్ షాహేజది మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో వక్ఫ్ భూములు ఎక్కువగా ఆక్రమణలకు గురవుతున్నాయని, ఇప్పటి వరకూ 2వేలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. దీనిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. గురువారం విజయవాడలోని మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశానని.. అక్కడ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే.. వాటి ఫలాలు పిల్లలకు అందడం లేదని.. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిచాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని తెలిపారు. విజయవాడలోని ఆ స్కూల్ ని వేరేప్రాంతానికి తరలించాలని.. జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. స్కూల్ ని తరలించిన తర్వాత నివేదికను కమిషన్ కు పంపాలని ఆదేశించారు.
మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ పరిస్థితి మారాలని.. తర్వాత రాష్ట్రంలో మళ్లీ పర్యటిస్తానని, నివేదికలను తీసుకుంటామని ఆమె తెలిపారు. మైనార్టీ హక్కులను కాపాడాల్సి బాధ్యత అధికారులందరిపై ఉందని హితవు పలికారు. సమాజంలో మార్పు విద్యతోనే సాధ్యం అవుతుందని.. అధికారులందరూ విద్య, వసతుల కల్పనపై దృష్టిపెట్టాలన్నారు. విద్య కోసం అవకాశాలను మెరుగుపరచడం, ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిలో సమాన వాటా, మైనారిటీల జీవన పరిస్థితులను మెరుగుపరచడం వంటి విధులు, బాధ్యతలను అధికారులు ఎప్పుడూ గుర్తించుకోవాలన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కంటే.. అందరూ కలిసి పనిచేస్తూ దేశ భవిష్యత్ ను మార్చుకుందామని పిలుపునిచ్చారు.
విద్యార్థుల స్కాలర్ షిప్ లు తీసుకోవడానికి కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలపై ప్రతి జిల్లా అధికారుల నుంచి వివరాలను అడిగి తెలసుకున్నారు. తల్లిదండ్రులకు మరింత అవగాహన కల్పించేందుకు వీలుగా ప్రతి నెలా కనీసం ఒక్కసారైనా జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారులు అవగాహన సదస్సులను నిర్వహించాలని ఆమె కోరారు. జిల్లాల వారీగా ఏమైనా చిన్న సమస్యలు ఉంటే కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం జాతీయ కమిషన్ సభ్యురాలిగా తనవంతు సహకారం ఎప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో ఇంతియాజ్, ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో ఎస్. అలీం బాషా, సర్వే కమిషనర్ (వక్ఫ్) షెరిన్ బేగం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *