-మూడు వేల సంతకాలతో గవర్నర్ పేరిట రూపొందించిన వినతిపత్రాలు
-రాజ్ భవన్ లో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియాను కలిసిన ఇరు గ్రామాల అఖిలపక్ష నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో ముదినేపల్లి మండలం పెదపాలపర్రు, కోడూరు గ్రామాలను గుడివాడ రూరల్ మండలంలో విలీనం చేసి, గుడివాడ డివిజన్ , కృష్ణా జిల్లాలో కొనసాగించాలని కోరుతూ అయా గ్రామాల అఖిలపక్ష నేతలు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియాకు వినతి పత్రం అందచేసారు. గవర్నర్ పేరిట దాదాపు మూడు వేల సంతకాలతో తయారు చేసిన వినతి పత్రాలను సోమవారం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో గుడివాడ డివిజన్ కేంద్రానికి ఐదు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామాలు పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా విభజన జరిగితే రెవిన్యూ డివిజన్ కేంద్రం కోసం 70 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుందన్నారు. ప్రస్తుతం 30 కిలోమీటర్ల ఉన్న జిల్లా కేంద్రం మచిలీపట్నం సైతం ఏలూరుకు మారటం వల్ల సమస్యల పరిష్కారం కోసం వ్యయ ప్రయాసలు తప్పవన్నారు.
సాధారణంగా పెదపాలపర్రు, కోడూరు వాసులుగా తమ అవసరాలు అన్ని గుడివాడతోనే ముడిపడి ఉన్నాయని మండలం ముదినేపల్లి అయినప్పటికీ తమ గ్రామలను దత్తత తీసుకున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖలు గుడివాడ రూరల్ మండలం మోటూరు, గుడివాడ పట్టణాలలో ఉన్నాయని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. పెదపాలపర్రు, కోడూరు గ్రామస్ధుల వైద్య అవసరాలకు సైతం వరుసగా ఐదు, పది కిలోమీటర్ల దూరంలోని గుడివాడే తీర్చుతుందని వివరించారు. తమ గ్రామల నడక పూర్తిగా గుడివాడతో ముడిపడి ఉండగా, తమను ఏలూరు జిల్లాలో కలపటం వల్ల అన్ని రకాలుగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేసారు.
విద్యాసంస్ధల మొదలు సబ్ రిజిస్టార్ కార్యాలయం, పోస్టాఫీసు వంటివి ఇప్పటికే గుడివాడకు కేటాయించబడి ఉన్నాయని పెదపాలపర్రు గ్రామ నాయకులు వెల్లడించారు. నివాసం ఒక జిల్లాలో, ఆస్తులు మరో జిల్లాలో అన్న చందంగా తమ పరిస్ధితి తారుమారవుతుందన్నారు. పెదపాలపర్రు నుండి గ్రామ పిఎసిఎస్ అధ్యక్షుడు బొప్పన ప్రసాద్, చిలుకూరి ఫణి కుమార్, చళ్లగుళ్ల శ్రీకాంత్, సంకురాత్రి మాధవరావు తదితరులు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాను కలిసిన వారిలో ఉన్నారు. కోడూరు గ్రామం అఖిలపక్ష నాయకులు సర్పంచ్ అడుసుమిల్లి కృష్ణ కుమారి, ఉప సర్పంచ్ వల్లభనేని శేషు బాబు, మాజీ ఎంపిటిసి సూరపనేని సుబ్రమణ్యం, సజ్జా వెంకట్రామయ్య చౌదరి, వల్లభనేని శివాజీ, తాతినేని లక్ష్మి నారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు కలిసారు.
Prajavartha Online Telugu News