-కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలకు సిద్ధం కావాలి
-డప్పులు కొట్టండి..గంటలు మోగించండి
-పాలకులకు వినిపించేలా ధరల పెరుగుదలపై నిరసన తెలపండి
-31 నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో నిరసనలకు శ్రీకారం
-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల పెరుగుదలపై “మాంగాయ్ ముక్త్ భారత్ అభియాన్” పేరుతో మూడు విడతలుగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ , సిఎన్జీ ఉత్పత్తుల పెరుగుదలపై ఈ నెల 31 నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్యాస్ సిలెండర్లు, స్కూటర్లు, బైక్ లకు పూలమాలలు వేసి నిరసనలు తెలపాలని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ కార్యక్రమాల వివరాలను అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఈ చెవిటి ప్రభుత్వానికి వినపడేలా, కనపడేలా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలకు సిద్ధం కావాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశంలో పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని, ఈ క్రమంలో ఈ నెల 31న గురువారం ఉదయం 11 గంటలకు ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి డప్పులు కొట్టి, గంటలు మోగించి కేంద్రంలోని పాలకులకు వినిపించేలా నిరసన తెలపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఏప్రిల్ 2 నుంచి 4 వరకు డీసీసీ ల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో “మాంగాయ్ ముక్త్ భారత్ ధర్నా -మార్చ్’ నిర్వహించాలని కోరారు. ఏప్రిల్ 7న ఉదయం 11 గంటలకు పీసీసీ ఆధ్వర్యంలో రాజధానిలో ధర్నా-మార్చ్ నిర్వహిస్తామన్నారు. ఎన్నికల దాకా ఇంధన ధరలను స్థిరంగా ఉంచి, ఎన్నికల ఫలితాలు వచ్చాక మళ్లీ సామాన్యుడి నడ్డి విరచడం ప్రారంభించారని, సామాన్యులపైనా, పేదలపైనా మోడీ సర్కారు యుద్ధం చేస్తోందని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తామని హామీ ఇచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, వారికి ఆ హామీ గురించి పదేపదే గుర్తుచేయాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం కొంత సమయం తీసుకుని పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ పెంచుకుంటూ పోతోందని, వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.50 పెంచారని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది నవంబరు 4 నుంచి మార్చి 21 వరకు చమురు కంపెనీలు ధరలు పెంచలేదని, ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజుల్లోనే మళ్లీ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరచడం ప్రారంభించాయని విమర్శించారు. ఈ నెల 31న ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళనలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News