Breaking News

భూముల రీసర్వేలో భూముల సరిహద్దుగట్లను మార్చం, సాగుదారులెవరనీ తొలగించం

-రాష్ట్రంలో 2023 డిశంబరు నాటికి భూముల రీసర్వే ప్రక్రియపూర్తి చేసేందుకు చర్యలు
-ఇప్పటికే 430 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి
-రీసర్వే ప్రక్రియతో భూరికార్డులు సులభతరం,రెగ్యులేటరీ భారం తగ్గించడమే లక్ష్యం
-మరో రెండు మాసాల్లో అమలులోకి ఆటో మ్యూటేషన్ విధానం
-రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,సిసిఎల్ఏ సాయిప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియలో ఏఒక్క సాగుదారుని, వాని అనుభములో ఉన్న భూమి నుండి తొలగించడం లేదా ఆభూమి సరిహద్దు గట్లను మార్చడం గాని చేయడం లేదని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు భూపరిపాలనాశాఖ ముఖ్య కమీషనర్ జి.సాయిప్రసాద్ వెల్లడించారు.మంగళవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూముల రీసర్వేపై ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం సమీక్ష చేస్తున్నారని కావున ఈప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే 430 గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేశామని వివరించారు.వచ్చే 2023 డిశంబరు నాటికి రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సాయి ప్రసాద్ మీడియాకు వివరించారు.
రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియ సుమారు 100 సంవత్సరాల క్రితం జరిగిందని కాని సర్వే అండ్ బౌండరీ యాక్టు ప్రకారం ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి భూముల రీసర్వే జరగాల్సి ఉందని స్పెషల్ సిఎస్ మరియు సిసిఎల్ఏ జి.సాయిప్రసాద్ చెప్పారు.కోర్టు కేసుల్లో పెండింగ్ లోఉన్న భూములు మినహా మిగతా భూములన్నిటిలో రీసర్వే ద్వారా ఆభూములకు సంబంధించిన హద్దులను నిర్ణయించుటకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.ముందుగా భూ రీకార్డుల ప్యూరిఫికేషన్ చర్యలు చేపట్టి ల్యాండ్ క్లాసిఫికేషన్ చేస్తామని తెలిపారు.తదుపరి డ్రోన్ల ద్వారా ఆగ్రామ మ్యాప్ ను తయారు చేసి ల్యాండ్ మార్క్స్ ను గుర్తించడం జరుగుతుందన్నారు.అనంతరం పాత మ్యాప్ ను డ్రోన్ మ్యాప్ తో సరిచూడం జరుగుతుందన్నారు.భూముల సర్వేకు సంబంధించిన పనులను మండల సర్వేయర్ నుండి గ్రామ సర్వేయర్లకు బాధ్యతలు అప్పగించడం జరిగిందని తెలిపారు.గ్రామ సర్వేయర్లుగా నియమించబడిన వారిలో అత్యధిక శాతం వరకూ బిటెక్ విద్యార్హతలు కలిగిన వారేనని, తద్వారా భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు.భూములకు సంబంధించి రికార్డులను ప్రజలకు సులభతరం చేయడంతో పాటు రెగ్యులేటరీ భారాన్ని వీలైనంత మేరకు తగ్గించే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పేర్కొన్నారు.

మరో రెండు మాసాల్లో ఆటో మ్యూటేషన్ విధానం అమలులోకి తెస్తాం….
మరో రెండు మాసాల్లో రాష్ట్రంలో ఆటో మ్యూటేషన్ విధానాన్ని అమలులోకి తేవడం జరుగుతుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ వెల్లడించారు.భూముల సర్వేకు సంబంధించి మ్యూటేషన్ ప్రక్రియ అనేది అత్యంత ముఖ్యమైన అంశమని ఆయన పేర్కొన్నారు. భూముల రీసర్వే ప్రక్రియకు సంబంధించి క్లయిములు మరియు అభ్యంతరముల పరిష్కారానికి ప్రత్యేకంగా మొబైల్ మెజిస్ట్రేట్లను నియమించామని చెప్పారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి సుమారు 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్పారు.ఆటో మ్యూటేషన్ విధానం అమలులోకి వస్తే ఒక ప్రాంతంలో ఆభూముకి సంబంధించిన అన్ని మార్పులు ఒకేసారి చేసుకునే వీలు కలుగుతుందని అన్నారు.మ్యూటేషన్ కు ముందు పట్టా సబ్ డివిజన్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

చుక్కల భూముల ధరఖాస్తుల పున:పరిశీలనకు కలక్టర్లకు ఆదేశాలు….
రాష్ట్రంలో చుక్కల భూములకు సంబంధించి సుమారు లక్ష ధరఖాస్తులు రాగా వాటిలో 59వేల ధరఖాస్తులు తిరస్కరించగా మరలా వాటిని పున:పరిశీలన చేయాలని జిల్లా కలక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని సిసిఎల్ఏ జి.సాయిప్రసాద్ వెల్లడించారు. చుక్కల భూములకు సంబంధించి ఇప్పుడు కూడా రెవెన్యూ అధికారులకు ధరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. 2017 నాటికి పట్టాదార్ పాస్ పుస్తకంలో వెబ్ ల్యాండ్ 1 బి, అడంగల్ లో పేరునమోదై ఉండి వరసగా 12 ఏళ్ళుపాటు క్లయిముదారుగాని వారి ముందువారుగా కొనసాగి ఉంటే ఆభూమి పట్టాభూమిగా మార్పుకాబడి అతనికే చెందుతుందని స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ చెప్పారు. ఈ మీడియా సమావేశంలో సిసిఎల్ఏ కార్యదర్శి డా.బాబు ఎ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు శాఖ కమీషనర్ సిద్దార్ధ జైన్,సిసిఎల్ఏ సంయుక్త కార్యదర్శి జి.గణేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *