-మహిళలంటే తెలుగుదేశం నేతలకు చిన్నచూపు
-దళిత మంత్రి కాన్వాయ్ పై టీడీపీ శ్రేణుల దాడి హేయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దళిత హోం మంత్రిపై తెలుగుదేశం నాయకుల దాడి హేయమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఒంగోలులో మహిళ హోం మంత్రి తానేటి వనిత కాన్వాయ్ పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డను సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబసభ్యులుగా చూస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. కానీ తెలుగుదేశం నాయకుల ప్రవర్తన మహిళలను కించపరిచేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ పట్ల మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా ఉదహరించారు. ఆ ఘటన మరువకముందే ఒంగోలులో దళిత మంత్రిపై దాడికి యత్నించడం బాధాకరమన్నారు. పైగా ఈ అంశాన్ని గొప్పగా చిత్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్ సైట్ లో పోస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. వీటిపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వివరణ ఇవ్వాలని.. మహిళ లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే విజయవాడ నగరంలో టీడీపీ నేత వినోద్ జైన్ ఘటన నుంచి ఒంగోలులో మహిళ హోం మంత్రిపై దాడి వరకు పచ్చ నేతల ఆగడాలపై తక్షణమే విచారణ చేపట్టాలని డీజీపీని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఉనికిని చాటుకునేందుకు టీడీపీ నేతలు ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని మల్లాది విష్ణు అన్నారు. పార్టీ లేదు.. బొ.. లేదు.. అని మాట్లాడిన అచ్చెన్నాయుడు కూడా వైఎస్సార్ సీపీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పచ్చ నేతల ఈ వింత ప్రవర్తనను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు.. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం నాయకులు ఇదే పంథాలో వ్యవహరించేవారన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. ఇలా అనేక అంశాలపై శాసనసభలో తీర్మాణాలు చేసినట్లు వెల్లడించారు. పార్లమెంట్లోనూ వైఎస్సార్ సీపీ ఎంపీలు నిర్విరామంగా పోరాడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయారని మల్లాది విష్ణు అన్నారు. అదే ఈ ప్రభుత్వంలో ఇంటింటికీ అందించిన సంక్షేమం వివరాలను గణాంకాలతో సహా చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 27 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. అమ్మఒడి, ఆసరా, ఈబీసీ నేస్తం, విద్యాదీవెన ఇలా గత మూడేళ్లలో నియోజకవర్గంలో లక్షా 70 వేల మంది లబ్ధిదారులకు రూ. 114 కోట్ల సంక్షేమాన్ని అందించామని.. ఈ లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలుగుదేశం నేతలు గత ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయగలరా..? అని సవాల్ విసిరారు. చివరకు కరోనా కష్టకాలంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ చేతులెత్తేశారని.. జూమ్ కాల్స్ కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం స్కాం స్కీంలన్నింటినీ తిరస్కరించి.. ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని అప్పగించినా టీడీపీ నేతల తీరు మారలేదన్నారు. ఈ ప్రభుత్వంలో విజయవంతమైన పథకాలపై విద్వేషపూర్వకంగా విషం కక్కుతున్నారన్నారు. ఈ గోబెల్స్ ప్రచారం అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే మొదలైందని మండిపడ్డారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని.. లేకుంటే ప్రజాక్షేత్రంలో మరోసారి అభాసుపాలు కావడం ఖాయమని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News