Breaking News

24 డిగ్రీల వద్ద ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత మనందరికీ మంచిది…

-24 డిగ్రీల వద్ద AC, ఇంధన వృధాను నివారిస్తుంది, చల్లని వాతావరణం కలుగచేస్తుంది , హానికరమైన ప్రభావాల నుండి మానవ శరీరాన్ని రక్షిస్తుంది, నెలవారీ విద్యుత్ బిల్లులను కొంతవరకు తగ్గిస్తుంది.
-ఏపీఎస్ఈసిఎం గృహ, వాణిజ్య సంస్థల వినియోగదారులకు 24 డిగ్రీల వద్ద ఏ సి ఉష్ణోగ్రత సెట్ చేయాలని విజ్ఞప్తి చేస్తుంది
-గది ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదలతో దాదాపు 6% విద్యుత్ ఆదా చేయవచ్చు
-20-డిగ్రీ సెల్సియస్ నుండి 24-డిగ్రీ సెల్సియస్‌కు మారడం వల్ల దాదాపు 24% విద్యుత్ ఆదా అవుతుంది
-ఆంధ్రప్రదేశ్‌లో ఏసీల కోసం సంవత్సరానికి దాదాపు 3000 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది
-దేశంలో మొత్తం ఇన్‌స్టాల్ చేయబడిన ఎయిర్ కండీషనర్ సామర్థ్యం 80 మిలియన్ TR (టన్ను రెఫ్రిజరేషన్ ) , 2030 నాటికి దేశంలోసుమారు 250 మిలియన్ TRకు పెరగవచ్చు.
-ఏసీని 24 డిగ్రీల వద్ద వాడటం వల్ల దేశంలో ఏటా రూ. 10,000 కోట్ల విలువైన 20 బిలియన్ యూనిట్ల ఇంధన ఆదా అవుతుందని అంచనా.
-ఒక AC రోజుకు 8 నుండి 10 గంటలు నడుస్తుంది, ప్రతిరోజూ 10 కిలోల CO2 ఉద్గారాలను విడుదల చేస్తుంది, ఇది వాతావరణ మార్పులకు ప్రధాన సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం దేశంలోనూ , మన రాష్ట్రంలోనూ నెలకొన్న విద్యుత్ కొరత నేపథ్యంలో కూడా విద్యుత్ వృథాను అరికట్టేందుకు ఏసీలను నిర్దిష్టమైన ఉష్ణోగ్రతలో వినియోగించడం ద్వారా గణనీయంగా విద్యుత్ ఆదా చేయవచ్చని రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ పేర్కొంది. విద్యుత్ వృథాను నివారించడంతో పాటు విలువైన సహజ వనరులను పరిరక్షించడం, వాతావరణంలోని హానికరమైన ఉద్గారాల ప్రభావం నుంచి మానవ శరీరాన్ని రక్షించడం వంటివి కూడా దీని ద్వారా సులభతరమవుతుందని వివరించింది. అత్యంత చల్లని వాతావరణాన్ని శరీరానికి అలవాటు చేయడం ద్వారా వచ్చే దుష్ప్రభావాలను కూడా తెలియజెప్పాలని సంకల్పించింది . వాణిజ్య మరియు నివాస భవనాల్లో 24 డిగ్రీల సెల్సియస్ వద్ద ఏసీల ఉష్ణోగ్రతను సెట్ చేసి వినియోగించాలని , దీని ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది.
ప్రస్తుతం వేసవి తీవ్రతరం అయినందున, అందునా ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతున్నందున విద్యుత్ వినియోగదారులు ఎయిర్ కండిషనర్ల భారీ వినియోగానికి దారితీసింది. ప్రజల ఆరోగ్యానికి మరియు వారికుటుంబాలకు , ఆర్థికపరంగా వెసులుబాటుకు సరిపడే స్టార్ రేటెడ్ ఏసీలను ఎంచుకుని వాటిని 24 డిగ్రీల సెల్సియస్ వద్ద డిఫాల్ట్ సెట్టింగ్లో ఉంచాలని ఏపీఎస్ఈసీఎం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ విజ్ఞప్తి చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉష్ణోగ్రతను ఎక్కువగా తగ్గించడం (ఎక్కువ కూలింగ్) వల్ల ఎయిర్ కండీషనర్ల జీవితకాలాన్ని తగ్గిస్తుందని, అదే సమయంలో నెలవారీ విద్యుత్ బిల్లు పెరుగుతుందని, మానవ శరీరంపై చల్లని వాతావరణం హానికరమైన ప్రభావాలను కలిగించేందుకు ఆస్కారం ఉందని ఏపీఎస్ఈసిఎం వివరించింది .
సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత సుమారుగా 36-37 డిగ్రీల సెల్సియస్. కానీ హోటళ్లు, విమానాశ్రయాలు మరియు కార్యాలయాలు వంటి పెద్ద వాణిజ్య సంస్థల్లో ఏసీ ఆపరేటింగ్ సిబ్బంది 18-21 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతను తగ్గిస్తుంటారు. ఇది అవసరానికి మించి అత్యంత చల్లదనాన్ని ఇస్తుంది. నిజానికి, ఇది అనారోగ్యకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. తక్కువ ఏసీ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల శ్వాసకోశ సమస్యలు, ఎముకలు సమస్య , తలనొప్పి, కళ్లు మరియు చర్మం పొడిబారడం, అల్పోష్ణస్థితి, అధిక రక్తపోటు (బీపీ) మొదలైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. ఈక్రమంలోనే ఏసీలను 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచితే మానవ శరీరానికి చాలా సౌకర్యంగా ఉంటుందని, ఆరోగ్యానికి ఇది మంచిదని నిపుణులు వెల్లడించిన విషయాలను ఎస్ఈసిఎం గుర్తుచేసింది .
శాస్త్రీయ సమాచారం మేరకు గది ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల మూలంగా విద్యుత్తులో 6% ఆదా చేయవచ్చని తేలింది. సాధారణంగా, గది ఉష్ణోగ్రత 20-21-డిగ్రీ సెల్సియస్ మధ్య సెట్ చేయబడి ఉంటుంది. అయితే, ప్రస్తుత వేసివిలో మండుతున్న ఎండల దృష్ట్యా అది 24-25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటే చల్లదనంగా ఉంటుంది. ఈనేపథ్యంలోనే రూమ్ టెంపరేచర్ను 20-డిగ్రీ సెల్సియస్ నుండి 24-డిగ్రీ సెల్సియస్ మధ్య మార్పును పరిగణనలోకి తీసుకుంటే, కనీసం 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. దీని వలన దాదాపు 24% విద్యుత్ ఆదా అవుతుంది. రాష్ట్రంలోని ప్రస్తుత విద్యుత్ కొరత పరిస్థితిలో రోజువారీ ఇంధన డిమాండ్ను కొంతమేరకు తీర్చడానికి ఇది దోహదపడుతుంది. ఫలితంగా రాష్ర్టంలోని వివిధ వర్గాల వినియోగదారులకు ప్రస్తుతం అందిస్తున్న 24X7 విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరచడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.
ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 ప్రకారం ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థగా ఉన్న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) డేటా ప్రకారం, దేశంలో ప్రస్తుతం 80 మిలియన్ టీఆర్ (టన్ను రిఫ్రిజిరేషన్) వ్యవస్థాపించిన మొత్తం ఎయిర్ కండీషనర్ సామర్థ్యం పెరగనుంది. 10 సంవత్సరాలలోపు దాదాపు 250 మిలియన్ టీఆర్కు చేరుకునే ప్రమాదం ఉంది. 2030 నాటికి ఎయిర్ కండిషనింగ్తో భారతదేశంలో విద్యుత్ లోడ్ సుమారు 200 గిగా వాట్స్కు పెరుగుతుందని అంచనా. ఈక్రమంలోనే వినియోగదారులు తమ ఏసీల్లో డిఫాల్ట్ ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్కు సెట్ చేస్తే దేశంలో ఏటా దాదాపు 20 బిలియన్ యూనిట్ల (రూ. 10,000 కోట్ల విలువైన) ఇంధనాన్ని ఆదా చేయవచ్చని ఆ నివేదికలో పేర్కొంది.
ప్రాథమిక అంచనాల ప్రకారం, రాష్ర్టంలో ఏసీలకు ప్రస్తుత వార్షిక డిమాండ్ దాదాపు 3000 మిలియన్ యూనిట్లుగా ఉండనుంది. ఇది రాష్ట్రం మొత్తం ఇంధన వినియోగంలో 5 శాతంగా నమోదవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏ పీ ఎస్ ఈ సి ఎం ) వినియోగదారులు తమ ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్కు సర్దుబాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది, ఇది విద్యుత్ వినియోగాన్ని కొంత మేరకు తగ్గించి, డిమాండ్ను తీర్చడంలో అటు డిస్కంలకు కూడా దోహద పడుతుంది
ఒక మనిషి 1.5 టన్నుల ఏసీని ఉపయోగిస్తే, అది గంటకు సుమారుగా ఒక యూనిట్ విద్యుత్ను వినియోగిస్తుంది. ఈ విధంగా ఒక యూనిట్ విద్యుత్ వినియోగిస్తే గాలిలోకి దాదాపు 0.98 కిలోల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది. ఒక ఏసీ రోజుకు 8 నుండి 10 గంటలు నడుస్తుంటే, అది ప్రతిరోజూ దాదాపు 10 కిలోల కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది, ఇది పర్యావరణ సంరక్షణలో పెద్ద సవాలుగా మారనుంది.
ఈక్రమంలోనే బీఈఈ సూచనల మేరకు ఏపీఎస్ఈసీఎం ప్రత్యేకించి అన్ని గృహాలలో, వాణిజ్య సంస్థలలో 24 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎయిర్ కండీషనర్లను నిర్వహించడం వల్ల ఒనగూరే ప్రయోజనాల గురించి వివిధ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశీయ వినియోగదారులతో పాటు, హోటళ్లు, మాల్స్, విమానాశ్రయాలు, కార్యాలయాలు, ప్రభుత్వాలు మరియు ఇతర వాణిజ్య భవనాలను లక్ష్యంగా చేసుకుని విస్తృత ప్రచారం చేయాలనీ నిర్ణయించింది .
ఎయిర్ కండీషనర్ మరింత సమర్ధవంతంగా పనిచేసేలా అధిక ఉష్ణోగ్రతను సెట్ చేయడం వంటి వాటిపై అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి ఏంటంటే…
1)వేడిగాలి ఇంట్లోకి రాకుండా ఉండేలా కిటికీలు, కర్టెన్లను విధిగా మూసివేసి ఉంచాలి.
2) ఇల్లు బాగా ఇన్సులేట్(వేడి ఉష్ణోగ్రతలు ఇంటిలోనికి రాకుండా నిరోధించడం ) చేయబడి ఉండాలి.
3) ఎయిర్ ఫిల్టర్లను శుభ్రంగా ఉంచాలి. ప్రతి 30 నుండి 90 రోజులకు వాటిని శుభ్రపరచడం లేదా కొత్తవాటిని మార్చడం ద్వారా ఏసీ యూనిట్లో గాలి సజావుగా కదులుతుంది.
4)థర్మోస్టాట్ దగ్గర ఉపకరణాలు ఉంచకూడదు. టీవీలు, ల్యాప్టాప్లు మరియు లైట్లు వంటి వేడిని ఉత్పత్తి చేసే పరికరాలు మరియు ఉపకరణాలను థర్మోస్టాట్కు దూరంగా ఉంచండి.
5) సీలింగ్ ఫ్యాన్లను ఉపయోగించండి.
స్వీయ మరియు సమాజ ప్రయోజనం కోసం విద్యుత్ను మరింత పొదుపుగా , సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిందిగా ఏ పీ ఎస్ ఈ సి ఎం విజ్ఞప్తి చేసింది. ఉదాహరణకు, గది నుండి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు మరియు ఏసీల స్విచ్లను ఆఫ్ చేయాలని సూచించింది. అలాగే టీవీ పవర్ స్విచ్ ఆఫ్ చేయాలి . టీవీ చూసిన తర్వాత రిమోట్ ఆఫ్ చేసినప్పటికీ, పవర్ స్విచ్ ఆన్ చేయడం వల్ల కొంత విద్యుత్ వృథా అవుతుంది . అలాగే మొబైల్ ఫోన్ను ఛార్జ్ చేసిన తర్వాత ఛార్జర్లను పూర్తిగా అన్ప్లగ్ చేయాలని లేదా కనీసం స్విచ్ ఆఫ్ చేయాలని ఎస్ ఈ సి ఎం సూచించింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *