మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థిని విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు మీద ధ్యాస చూపిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల అన్నారు. స్థానిక కృష్ణా యూనివర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన మత్తు పానీయంపై కళాజాత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థి, విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. మన రాష్ట్ర ప్రభుత్వం మత్తు పానీయాలపై ఒక అవగాహన ఏర్పరచాలని, యువత చెడు మార్గంలో నడవకుండా వారి కుటుంబాలను, రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ప్రభుత్వం నడపడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని మద్య విమోచన కమిటీ ఛైర్మెన్ గా వల్లభరెడ్డి లక్ష్మణ రెడ్డి నియమించడం ఆయన ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా 60 ఇంజినీరింగ్ కళాశాలలలో, పలు విశ్వవిద్యాలయాలలో ఈ తరహా కళాజాతాలు ఏర్పాటుచేయడం ఎంతో శుభ పరిణామమని జాయింట్ కలెక్టర్ అన్నారు. పురాతన కాలం నాటి వైద్యులు జీర్ణ వాహిక, కేంద్ర నాడీ వ్యవస్థ మొదలైన వ్యాధులకు హిప్నోటిక్స్ , పెయిన్ కిల్లర్స్‌గా మత్తు పదార్థాలను విస్తృతంగా ఉపయోగించారని తెలిపారు. ప్రస్తుతం, మాదకద్రవ్యాలు చాలా తరచుగా ఆంకోలాజికల్ వ్యాధులు, హృదయనాళ వ్యవస్థ యొక్క వ్యాధులకు నొప్పి నివారణలుగాఉపయోగించబడుతున్నాయన్నారు. మన దేశంలో 28 కోట్ల మంది తాగుడు ఇతర మత్తు పదార్థాల వ్యసనంకు బానిస అయ్యారని, నేటి యువతరం తల్లిదండ్రులు, సోదరుల కంటే ఇతరుల మాటలకే విలువ ఇస్తున్నారన్నారు. గతంలో చెడు అలవాట్లు చేసుకోవాలంటే , భవిష్యత్ పర్యవసనాలు గూర్చి యోచించేవారని, నేడు క్షణికానందం కోసం తప్పటడుగులు వేయడానికి ఏ మాత్రం సందేహించడం లేదన్నారు.
గంజాయి, నల్లమందు, గుడుంబా, హెరాయిన్, కొకైన్, చరస్ పేర్లు ఏవైనా వాటికి యువత బానిసలుగా మారిపోతున్నారని మాదక ద్రవ్యాలు ఉత్పత్తి, క్రయ విక్రయాలు, రవాణా, వాటి వాడకం పెచ్చుమీరి అదో పెద్ద వ్యాపార రంగంగా ఆవిర్భవించి మాదక ద్రవ్యాల మాఫియా దేశంలో సమాంతర స్థాయిలో వ్యాపారాన్ని నడుపుతుందంటే ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదన్నారు. మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలకు, అక్రమార్జనకు మరిగినవారు ఆత్మరక్షణకో, ప్రత్యర్థులను మట్టుబెట్టడానికో ఆయుధాలు కొనుగోలు చేసి హింసోన్మాదంతో చెలరేగిపోతున్నారని ఆయన వివరించారు. చదువు మీద దృష్టిసారింది, తమను పెంచిపోషిస్తున్న తల్లిదండ్రుల మాటకు విలువిస్తూ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. సమాజం కూడా యువతపై ఎంతో నమ్మకం పెట్టుకుందని, సమాజానికి, దేశానికి ఉపయోగపడేలా ఎదుగుతామన్న ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. విశ్వవ్యాప్తంగా వ్యాపించిన సోషల్ మీడియా వల్ల ప్రయోజనాలు ఉన్నాయని, అయితే దీనికి రెండవ వైపు నష్టాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.
విద్యార్థులు ఈ దశలో చెడు వ్యసనాలకు గురి కాకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థల పేరు నిలపాలని జీవితంలో మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థి జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కొని నిలబడినప్పుడు భవిష్యత్తులో మంచి జీవితం లభిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు మాట, గురువు మాట విని విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకుంటే మిగతా జీవితం మంచిగా జరుగుతుందని తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధనతో పాటు జీవిత సత్యాలను బోధించి వారు మంచి చేయటానికి నిరంతరం కృషి చేయాలని కోరారు.
తొలుత రంగం జట్టు సభ్యులు డప్పు వ్యాయిద్యంతో లయబద్దంగా నృత్య ప్రదర్శనలు చేస్తూ చెడు వ్యసనాలు విడిచిపెట్టాలని ఉత్తేజ గీతాలు పాడుతూ కుర్రకారును ఉర్రుతలూగించారు. ” పరువే పోతుంది …పతనం చేస్తుంది.. ప్రాణం తీస్తుందిరా మద్యం బతుకు ఆగం చేస్తుందిరా మద్యం ” అంటూ పాటలతో అందరిని ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ కె . బి . చంద్రశెఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రామిరెడ్డి, రాష్ట్ర మద్య విమోచన కమిటీ ఛైర్మెన్ వల్లభరెడ్డి లక్ష్మణ రెడ్డి, యూనివర్సిటీ ప్రిన్సిపాల్ , రెక్టర్ ప్రొఫెసర్ డి. సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News