Breaking News

ఆ జగన్మాత సర్వమంగళకారిణి: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర‌రావు

-భక్తజనులను సమ్మోహితులను చేస్తూ సాగిన దేవీ వైభవతత్వ ప్రవచనామృతం
-అశేషంగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తజన సందోహం
-చాగంటి వారి ప్రసంగశైలి విశిష్టమైనది: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భక్తి అనే తల్లి ఒడిలో కూర్చున్న శిశువు ఎప్పుడు పరవశంతో ఉంటాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణం నందు దేవీవైభవతత్వంపై చాగంటి కోటేశ్వరరావుచే ముగింపు ప్రవచన కార్యక్రమం శనివారం భక్తజనులను సమ్మోహితులను చూస్తూ సాగింది. మల్లాది వేంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత కనకదుర్గమ్మ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కళా నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తూ.. ఆ జగన్మాత సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని అని వ్యాఖ్యానించారు. రూపం ఏదైనా అమ్మవారి అనుగ్రహం ఓకే విధంగా ఉంటుందన్నారు. భగవత్ భక్తి మనిషిని ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుతుందన్నారు. ధర్మ ఛట్రాన్ని అతిక్రమించిన వారు ఎన్నడూ సంతోషంగా ఉండలేరన్నారు. ఓర్పుతో కోపాన్ని నిగ్రహించుకున్న వ్యక్తి ధన్యజీవి అని వ్యాఖ్యానించారు. మానసిక ప్రశాంతత ఆ జగన్మాత అనుగ్రహంతోనే సాధ్యపడుతుందన్నారు. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత ఆ జగజ్జనని అని వ్యాఖ్యానించారు. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను ధ్యానిస్తే సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందన్నారు. అపార‌మైన ద‌య ఆ లోకైక మాత ల‌క్షణ‌మ‌ని, దాన్ని తెలుసుకోవ‌డం ఎవ‌రిత‌ర‌మూ కాద‌ని అన్నారు.

భ‌గ‌వంతుడు పంచేంద్రియాల‌తో మ‌నిషిని సృష్టించి ధ‌ర్మ‌, అర్థ‌, కామ, మోక్షాల‌నే చ‌తుర్విద పురుషార్థాల‌ను నిర్దేశించాడ‌ని చాగంటి వారు తెలియ‌జేశారు. స‌రైన మార్గంలో వీటిని పాటించిన వారు ఉన్నత‌మైన స్థితికి చేరుకుంటార‌ని తెలిపారు. భౌతిక‌మైన శ‌రీరం గురించి ఆలోచించ‌కుండా భ‌గ‌వంతునిలో ఐక్యమ‌య్యేందుకు సిద్ధప‌డే స్థితి ఉన్నత‌మైన భ‌క్తికి తార్కాణ‌మ‌న్నారు. మానవుడు ఒత్తిడిని జయించాలంటే ఆధ్యాత్మికత వైపు నడవాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్త జనులను సమ్మోహితులను చేస్తున్న చాగంటి వారి ప్రసంగశైలి ఎంతో విశిష్టమైనదన్నారు. తన ప్రవచనాల ద్వారా చాగంటి వారు తెలుగు జాతిని చైతన్యపరుస్తున్నారన్నారు. ఆయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి అసాధారణమని పేర్కొన్నారు. విభిన్న అంశాల మీద ఏకధాటిగా మాట్లాడగల దిట్ట అని కీర్తించారు. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తున్నారన్నారు. అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకుని.. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర తదితర బిరుదులను అందుకున్నారన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో DRO మోహన్ కుమార్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధర రావు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *