అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వి.ఐ.టి – ఏ.పి స్కూల్ ఆఫ్ లా ఆధ్య్వర్యంలో రెండు రోజుల ఇంట్రా మూట్ కోర్ట్ పోటీలు 17 మరియు 18 మే 2022 న నిర్వహించారు. ఈ పోటీలలో బి.ఏ. ఎల్ ఎల్.బి(హానర్స్) మరియు బి.బి.ఏ. ఎల్ ఎల్ .బి. (హానర్స్) కోర్సులకు చెందిన మొదటి , రెండు సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు 18 జట్లుగా పోటీపడ్డారు. ఈ జట్లలో 8 జట్లు క్వార్టర్-ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇందులో మంతెన భవ్య శ్రీ, పెనుమాక శ్రీ నిఖి, మరియు పిళ్ళ మౌనీషా సాయితో కూడిన జట్టు విజేతగా నిలిచింది.
వి.ఐ.టి – ఏ.పి స్కూల్ ఆఫ్ లా డీన్ డా|| బెనర్జీ చక్కా మాట్లాడుతూ, మూట్ కోర్ట్ అనేది చట్టపరమైన ప్రక్రియలు మరియు ట్రయల్స్ జరిగే నిజమైన కోర్టు గదికి ప్రతి రూపమే. దీనిని మాక్ కోర్ట్ అని కూడా పిలుస్తారు, దీనిలో న్యాయ విద్యార్ధులు నిపుణులుగా వ్యవహరిస్తారు మరియు సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి, ప్రశ్నించినప్పుడు నమ్మకంగా సమాధానమివ్వడానికి మరియు వారి వక్తృత్వం, రచన మరియు ఒప్పించే నైపుణ్యాలను ప్రదర్శించడానికి వారికి కేటాయించిన అన్ని బాధ్యతలు మరియు విధులను నిర్వర్తించడానికి ఉపయోగపడుతుందని తెలియచేసారు.
పోటీలకు సివిల్ కేసు ఎంపికయ్యిందని , లాటరీ డ్రా ద్వారా వాది మరియు ప్రతివాది ఎంపిక జరిగిందని ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మూల స్నేహ గౌడ్ తెలిపారు.
ఈ కేసు ను ఎన్.జె.రత్నకుమార్ (ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, నందిగామ) , వై.వి.అనిల్ కుమార్ (న్యాయవాది, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్), ఏ.వి పార్థ సారధి (రిటైర్డ్ జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి ) లతో కూడిన ధర్మాసనం ముందు వాదించటం జరిగింది.
మంతెన భవ్య శ్రీ, పెనుమాక శ్రీ నిఖి, పిళ్ళ మౌనిషా సాయి, బీద రష్మిత రాణి యాదవ్, చింతల శ్రీవాణి, అనగ ప్రమోద్‌లతో కూడిన జట్లు ధర్మాసనం ముందు ఫైనల్ రౌండ్‌కు హాజరయ్యాయి. బెస్ట్ స్పీకర్ అవార్డు పెనుమాక శ్రీ నిఖి, ఉత్తమ రీసెర్చర్ అవార్డు అనగ ప్రమోద్, ఉత్తమ మెమోరియల్ అవార్డు బీద రష్మిత రాణి యాదవ్, చింతల శ్రీవాణి, అనగ ప్రమోద్‌లకు దక్కాయి.
వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోటారెడ్డి, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందించారు. ఆయన మాట్లాడుతూ చట్టపరమైన సమస్యలు, అంశాలను విశ్లేషించండంలో మూట్‌కోర్టు పోటీలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తాయని, అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలని తెలియచేసారు.
వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| సిఎల్వి శివకుమార్ మాట్లాడుతూ వి.ఐ.టి – ఏ.పి స్కూల్ ఆఫ్ లా మూట్ కోర్ట్ కాంపిటీషన్ మొదటి మరియు రెండవ సంవత్సర విద్యార్థులకు ఈ పోటీ రంగంలో వ్రాతపూర్వక మరియు మౌఖిక న్యాయవాద నైపుణ్యాలను మెరుగుపర్చడానికి విలువైన అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు.
Prajavartha Online Telugu News