విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ మరియు సచివాలయ ఉద్యోగుల ఇతర సమస్యలపై తనను కలిసిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నాయకులకు చంద్రశేఖర్ రెడ్డి ప్రోబేషన్ డిక్లరేషన్ కు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే ప్రక్రియ ముందుకు సాగుతుందని తెలియజేశారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి.జాని పాషా ఆధ్వర్యంలోని 5గురు రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రతినిధి బృందం గురువారం విజయవాడలో,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఉద్యోగుల సంక్షేమం యన్.చంద్రశేఖర్ రెడ్డిని ఏపీఎన్జీవో రాష్ట్ర,అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండి. శ్రీనివాసరావు మరియు కె.విశివారెడ్డిల సమక్షంలో కలిసి సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ మరియు ప్రోబేషన్ డిక్లరేషన్ తో ముడి పడి ఉన్న ఇతర ముఖ్య సమస్యలపై అరగంట పాటు చర్చించినట్లు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు యన్.చంద్రశేఖర్ రెడ్డి సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఇప్పటికే డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ కాని వారి కోసం మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున పరీక్షలు నిర్వహించడం కోసం ఏపీపీఎస్సీ వారితో మాట్లాడటం జరిగిందని,ప్రోబేషన్ డిక్లరేషన్ తో ముడిపడి ఉన్న అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తూ అన్ని సమస్యల పట్ల ప్రభుత్వం తరఫున పరిష్కారాలు చేపడుతున్నామని,రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అంతా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల దేనని చంద్రశేఖర్ రెడ్డి పునరుద్ఘాటించారు.
అలాగే వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మరింతగా జాతీయస్థాయిలో ఇనుమడింప చేసే విధంగా పనిచేయాలని ప్రజలకు సేవ చేయడం గొప్ప వరం అని అటువంటి అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
ఈ సందర్భంగా తనను కలిసిన ఫెడరేషన్ ప్రతినిధి బృందానికి ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్యోగ సంఘం నాయకులు నిరంతరం నిస్వార్థంగా పనిచేయాలని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డిజానిపాషా, ఫెడరేషన్ క్యాపిటల్ సిటీ అధ్యక్షులు ఎం.శశిధర్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎస్.కె సుభాని,పి.మనోహర్,యస్.కె.రహీం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News