-60 వ వార్డు 266వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి సొంత గూడు ఉండాలనే దృఢ సంకల్పంతో జగనన్న ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 60 వ డివిజన్ – 266 వ వార్డు సచివాలయం పరిధి E-బ్లాక్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణ, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,257 గృహాలలో, తొలిరోజు 495 గడపలను సందర్శించారు. ప్రతిఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ అన్ని శాఖల అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కాలనీలో వంద శాతం నీటి సరఫరా జరిగేలా రూ. 26.36 లక్షల వ్యయంతో మంచినీటి పైపు లైన్ పనులను ప్రారంభించి.. ఇటీవల పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. కనుక ఎక్కడా కూడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, బోరు నీరు వేర్వేరుగా ఏఏ వేళలలో సరఫరా అవుతాయో ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. నీటిని పొదుపుగా వాడాలని ఈ సందర్భంగా గృహ యజమానులకు సూచించారు. సైడ్ కాలువల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించాలని ఎలక్ట్రికల్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక పార్కును సందర్శించిన ఆయన సదుపాయాలపై వాకర్స్ తో మాట్లాడారు. ఎమ్మెల్యే ఒక్క మాటతో మెరక పోయించి పార్కును చదును చేయడంతో పాటు లైట్లు ఏర్పాటు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మహిళలకు దిశ యాప్ వినియోగంపై విస్తృత అవగాహన కల్పిస్తూ పర్యటన కొనసాగించారు.
పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పట్టాలు పొందిన లబ్ధిదారులతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడారు. వీరందరికీ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించేలా ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. స్థలం మంజూరైన లబ్ధిదారులను లేఅవుట్లకు తీసుకువెళ్లాలన్నారు. వాంబే కాలనీలో ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇటీవల స్థానిక కమ్యూనిటీ హాల్లో మేళా కూడా నిర్వహించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇప్పటికే ఈ అంశంపై కౌన్సిల్ ఆమోదం తెలిపి.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. రెండు నెలల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. అలాగే డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసి.. గృహ ప్రవేశాలు జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.
266వ వార్డు సచివాలయ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 2.25 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 381 మందికి ప్రతినెలా రూ. 9.74 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 600 మందికి రూ. 87 లక్షలు., విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా 84 మందికి రూ. 19 లక్షలు., వైఎస్సార్ ఆసరా ద్వారా 130 మందికి రూ. 65 లక్షలు., కాపునేస్తం ద్వారా 17 మందికి రూ. 2.55 లక్షలు., సున్నావడ్డీ ద్వారా 310 మందికి రూ.7 లక్షలు., జగనన్న తోడు ద్వారా 11 మందికి రూ.1.10 లక్షలు., చేయూత ద్వారా 128 మందికి రూ. 24 లక్షలు., వాహనమిత్ర ద్వారా 26 మందికి రూ. 2.60 లక్షలు., చేదోడు ద్వారా రూ. 10 వేల చొప్పున 16 మంది రూ. 1.60 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి అనే భ్రమలో కాలం వెళ్లదీసి.. పేదల ప్రజలను పూర్తిగా విస్మరించిందని మల్లాది విష్ణు అన్నారు. నగర అభివృద్ధి విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ.. ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా రూ. కోటిన్నర నిధులతో ఈ ప్రాంతంలో రోడ్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వానికి సంక్షేమం అనే పథానికి అర్థం కూడా తెలియదని మల్లాది విష్ణు అన్నారు. కానీ తాము గడప గడపకు వెళ్లి ప్రతి ఇంటికి అందించిన సంక్షేమాన్ని బుక్ లెట్ల ద్వారా అంకెలతో సహా వివరిస్తున్నామన్నారు. వాంబే కాలనీలో ఎలక్ట్రికల్ క్రిమిటోరియం ఈ ప్రభుత్వంలోనే రావడం జరిగిందని వెల్లడించారు. అలాగే ఈ ప్రాంతంలో రూ. 2.50 కోట్ల నిధులతో నూతన బస్టాండ్ ను నిర్మించబోతున్నట్లు చెప్పారు.
విద్యుత్ ఛార్జీలపై తెలుగుదేశం విమర్శలు హాస్యాస్పదని మల్లాది విష్ణు అన్నారు. విద్యుత్ వ్యవస్థ నాశనం అవ్వడానికి గత తెలుగుదేశం అసమర్థ పాలనే ప్రధాన కారణమని విమర్శించారు. ఒకవైపు అప్పులు, మరోవైపు బకాయిలు పెంచి.. గత పాలకులు అడ్డగోలుగా విద్యుత్ సంస్థలను నడిపారని మండిపడ్డారు. విద్యుత్ సంస్థలకు రూ.20,790 కోట్లు ఉన్న అప్పును రూ.69 వేల కోట్లకు పెంచిన ఘనత చంద్రబాబుది అని దుయ్యబట్టారు. విద్యుత్ బకాయిలను రూ.21,540 కోట్లకు పెంచిన పాపం ముమ్మాటికీ గత టీడీపీ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం కుప్పకూల్చిన విద్యుత్ వ్యవస్థను తిరిగి నిలబెట్టేందుకు విద్యుత్ ఛార్జీలను స్వలంగా మాత్రమే పెంచడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలను ఈ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ లోనే తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ టారీఫ్ ఛార్జీలు దేశంలో ఏపీలోనే స్వల్పమని ఉద్ఘాటించారు. కనుక విద్యుత్ చార్జీలపై ప్రతిపక్షాల నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 2019 తర్వాత జరిగిన దాదాపు 6 ఎన్నికలలో మరలా వైఎస్సార్ సీపీని అత్యంత భారీ మెజార్టీతో రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారని మల్లాది విష్ణు గుర్తుచేశారు. 2024లోనూ ఇవే ఫలితాలు పునరావృతం కావడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, డీఈ గురునాథం, ఏ.ఎం.ఓ.హెచ్. రామకోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్ పెక్టర్ బాలకృష్ణ, 30వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జానారెడ్డి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు మోదుగుల గణేష్, బత్తుల దుర్గారావు, ఇస్మాయిల్, బాబు, కిరణ్, కుమారి, బలగా శ్రీను, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News