-64 వ వార్డు 281 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పరిమితి, కాలపరిమితి లేకుండా అర్హులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ – 281 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశిష్ట ఆదరణ లభించింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రామాలయం వీధి, అంగన్వాడీ స్కూల్ పార్కు వీధి, సుబ్బారెడ్డి స్కూల్ వీధులలో విస్తృతంగా పర్యటించారు. 817 గడపలను సందర్శించి డ్రెయిన్లు, త్రాగునీరు, వీధి దీపాలు వంటి పలు సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కరించారు. పథకాల అమలు తీరుపై ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయడంతో.. సచివాలయ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా హెల్త్ సెక్రటరీలు కరోనా కష్ట సమయంలో ఫ్యామిలీ డాక్టర్లు లాగా అందించిన సేవలను అభినందించారు. పబ్లిక్ హెల్త్ సెంటర్ లో మందుల కొరత ఉన్నట్లు తన దృష్టికి రావడంతో.. వెంటనే సీఎంహెచ్ఓతో మాట్లాడి పేదలకు మందులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
పర్యటనలో భాగంగా పలువురు చిరువ్యాపారులతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముచ్చటించారు. జగనన్న తోడు పథకం ద్వారా అందిన సాయంపై తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయాలు విక్రయించేవారు, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లు అమ్మే చిరువ్యాపారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని తమ ఆర్థిక పురోభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్పప్పటికీ.. చిరువ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న ప్రభుత్వం ముందుకొచ్చిందని మల్లాది విష్ణు అన్నారు. కరోనా కారణంగా ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోయిన వీధి వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు చేయూతనందించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడిందని చెప్పుకొచ్చారు. దీని ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీలేకుండా రూ.10వేలు అందుతుందని, ఈ రుణం సంవత్సర కాలంలో వడ్డీలేకుండా చెల్లించాల్సి ఉంటుందన్నారు. రుణం చెల్లిస్తే మరోసారి రూ.10వేలు తీసుకునే అవకాశం ఉందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం 1,831 మందికి రూ.4,96,117 వడ్డీ జమ చేయటం జరిగిందన్నారు. అంతే కాకుండా మరో 318 మందికి రూ. 31.80 లక్షలు మూడో విడత కింద రుణాలు అందజేసినట్లు పేర్కొన్నారు.
ప్రజారంజకంగా మూడేళ్ల పాలన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయాన్ని సాధించి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులకు ఈ సందర్భంగా మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు ఆశించిన దాని కన్నా మెరుగైన పాలనను ఈ మూడేళ్లలో అందించినట్లు వెల్లడించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా మిన్నగా.. అవినీతిరహిత, మధ్యవర్తులు లేని పారదర్శక పాలనను జగనన్న ప్రభుత్వం ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు. పాలనలో ఎప్పటికప్పుడు నూతన విధానాలకు శ్రీకారం చుడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు
అనంతరం మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ఐదేళ్ల పాలన కన్నా 200 శాతం అధికంగా ఈ మూడేళ్లలో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమాన్ని అందించడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గంలో విద్యకు దాదాపు రూ. 100 కోట్లు, మహిళా సాధికారతకు రూ. 120 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. సచివాలయ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5.12 కోట్ల సంక్షేమాన్ని అందించడంతో పాటుగా.. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5.07 కోట్ల సంక్షేమాన్ని నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు తెలియజేశారు. నిత్యావసరాల ధరలను కూడా ఈ ప్రభుత్వం నియంత్రించడం జరుగుతుందని తెలియజేశారు. బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. బియ్యం పంపిణీపై జీవీఎల్ వ్యాఖ్యలు అర్థరహితమని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సగం మందికే కేంద్రం బియ్యం ఇస్తోందని.. కానీ గడప గడపకు రేషన్ వాహనం ద్వారా పూర్తిస్థాయిలో బియ్యాన్ని ఈ ప్రభుత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో కనీసం ఖాతా తెరవని బీజేపీకి.. జగనన్న ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదని విమర్శించారు. మరోవైపు జగనన్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక.. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి నాయకులు రాష్ట్రాన్ని స్టేట్ ఆఫ్ టెర్రర్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మీ అనురాగానికి, ఆప్యాయతకు కృతజ్ఞుడిని
రెండు రోజుల పర్యటనలో ప్రజలు చూపిన ప్రేమానురాగాల పట్ల ఎమ్మెల్యే మల్లాది విష్ణు హర్షం వ్యక్తం చేశారు. మీరు చూపిన అభిమానం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రతి అడుగులో ప్రజల ఆప్యాయత, మద్దతు కనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయ పరిధిలో ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, డిఈ(ఇంజనీరింగ్) గురునాథం, డిఈ(వాటర్) రామకృష్ణ, ఏఈ(వాటర్) అరుణ్ కుమార్, ఏఈ(కరెంట్) కృష్ణారెడ్డి, 62వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, సొసైటీ బ్యాంకు చైర్మన్ రవీందర్ రెడ్డి, నాయకులు అలంపూర్ విజయ్, మోదుగుల గణేష్, పందిరి వాసు, ఎస్.కె.ఇస్మాయిల్, మేడా రమేష్, జె.డి.కృప, పి.నాగేశ్వరరావు, కొక్కిరిగడ్డ నాని, వెంకటేశ్వరమ్మ, వరాలమ్మ, లత, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News