-తోకాడ లో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం
-జిల్లా కలెక్టర్ మరియు శాసన సభ్యులు
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ / పట్టణ ప్రాంతాల్లో పిఎం ఏ వై – వై ఎస్ ఆర్ కింద 1323 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని, ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన చేపట్టి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవి లత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం రాజానగరం మండలం తోకాడ గ్రామం లో 44 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా తో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణాలకు చొరవ చూపాలని కోరారు. లేఅవుట్ లోనే ఇసుక, సిమెంట్, కిటికీలు, స్టీలు అందుబాటులో ఉంచుతున్నా మన్నారు. లే అవుట్ లో రహదారులు, విద్యుత్తు, త్రాగునీరు వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన ఇళ్లకు విద్యుత్తు, కుళాయి కనెక్షన్ లను వెంటనే ఇస్తామన్నారు. అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నామని మాధవిలత తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే లక్షా ఎనభై వేల రూపాయలతో పాటు డ్వాక్రా సంఘాలు మహిళలకు మరో రూ.50 వేల రూపాయలు రుణ సౌకర్యం కల్పించి, ఆ మొత్తంతో ఇంటి నిర్మాణం ప్రారంభించా లన్నారు. లబ్ధిదారులకు ఆయా దశల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన వెంటనే నిర్మాణ వ్యయం లబ్ధిదారుల బ్యాంకు ఖాతా కు చేస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధుల సహకారం అందిస్తే అభివృద్ధి పనులు వేగంగా చేపట్టగలమని, అందుకు రాజానగరం శాసనసభ్యులు సభ్యులు జక్కంపూడి రాజా నిదర్శనం అన్నారు. నియోజకవర్గంలో శాసనసభ్యులు పై భరోసాతో ఆయన అధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు అంకిత భావంతో పనిచేయడం వలన ఆర్బీకెలు, సచివాలయాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలు 80 శాతం పైగా పూర్తి అవ్వడం ఇందుకు నిదర్శన మంటూ కలెక్టర్ అభినందించారు. మహిళలు పేరునే ఇంటి పట్టాలు ఇచ్చి ప్రభుత్వం మహిళలపై ఉన్న నమ్మకాన్ని తేటతెల్లం చేస్తోందని, ఆస్తిని తరతరాల నిలబెట్టు కోవాలన్నారు.
జగనన్న ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసేందుకు నవరత్నాలు లో భాగంగా ఉచితంగా ఇంటి స్థలాలు అందించి ఇళ్ల నిర్మాణాలను ప్రోత్సహించడం జరుగుతోందని శాసనసభ్యులు జక్కంపూడి రాజా తెలిపారు. ప్రభుత్వం లక్షల రూపాయలు ఖరీదు చేసే స్థలాల సేకరణ చేసి పట్టాలు ఇచ్చి లేఅవుట్ లోనే ఇసుక, సిమెంట్, స్టీలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
తమది సంక్షేమ ప్రభుత్వమని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సొంత ఇంటి నిర్మాణం చేసేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా పంపిణీనీ ఒక భాద్యతగా మన ముఖ్యమంత్రి తీసుకుని అమలు చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాలు మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. ఇది నిరంతర ప్రక్రియని సీఎం పేర్కొన్నారని తెలిపారు. జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు ఇతర వసతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనులను చేపడుతున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిరోజు ఇంటి నిర్మాణాలపై అధికారులను క్షేత్ర స్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తూ సమీక్ష చేయడం జరుగుతొందన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటి నిర్మాణాలు చేయాలని కోరారు. గత ప్రభుత్వం లో సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రి గా పని చేసిన వారు ఒక్క ఇంటి పట్టా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న ఊరికి దగ్గరలో చక్కని సౌకర్యాలతో కాలనీలను ఏర్పాటు చేసి, ప్రజలకు అందించడం జరుగుతోందన్నారు.
2021-22 సంవత్సరానికి సంబంధించి పీఎంఏవై క్రింద రాజానగరం నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాల్లో రాజానగరంలో 482 మందికి, కోరుకొండ లో 620 మందికి, సీతానగరం లో 221 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు.
సభా కార్యక్రమానికి తోకాడ సర్పంచ్ వై వి వి చక్రధరరావు అధ్యక్షత వహించగా,ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎం.సీతారత్నం, జడ్పిటిసి వాసంశెట్టి పెద్ద వెంకన్న, ఎంపీటీసీ గండి వెంకట సుజాత, ఆర్డీఓ ఏ.చైతన్య వర్షిణి, జిల్లా హౌసింగ్ అధికారి బి.తారా సింగ్, ఏ.ఎమ్.సి. చైర్మన్ వేమగిరి కృష్ణ, ఈ ఈ, సోములు, డి. ఈ, జి.పరశురామ్, ఏ. ఈ, కె. నగేష్ పలువురు ఎంపిపీలు, సర్పంచులు, స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News