Breaking News

మూడేళ్ల సుపరిపాలనపై సెంట్రల్ వ్యాప్తంగా ఘనంగా సంబరాలు

-పేదల ఆకాంక్షలను నిజం చేస్తున్న జగనన్న సర్కార్
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే నిజమైన సంక్షేమం, అభివృద్ధి అని శాసనసభ వేదికగా చెప్పడమే కాకుండా.. ఆ దిశగా చర్యలు చేపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చారిత్రాత్మక విజయంతో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సోమవారం సంబరాలు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముత్యాలంపాడులోని గవర్నమెంట్ ప్రెస్ వద్ద జరిగిన వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి.. ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. పాలనలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నూతన విధానాలకు శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. జన్మభూమి కమిటీలు వంటి అవినీతి వ్యవస్థలను కాకుండా.. వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు పారదర్శకంగా పాలనను అందిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 95 శాతం హామీలను అమలు చేయడంతో పాటుగా.. మేనిఫెస్టోలో పేర్కొనని మరెన్నో హామీలను అమలు చేశామన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకనుగుణంగా వారి అభ్యున్నతికి అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని మల్లాది విష్ణు మండిపడ్డారు. పాలన అంతా భ్రమరావతి చుట్టూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడానికే పరిమితమైందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు చేయలేనిది.. సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్లలో చేసి చూపారన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా, ప్రగతి పథంలో నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలను ఒక క్రమపద్ధతిలో నిర్మాణాత్మకంగా ప్రజలకు చేరవేసేందుకు.. వార్షిక క్యాలెండర్ ను సైతం రూపొందించడం జరిగిందన్నారు. నవరత్నాల ద్వారా పేద, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మేలు చేకూరిందన్నారు. వైఎస్సార్ ఆసరా, అమ్మఒడి, పేదలందరికీ ఇళ్లు, చేయూత, విద్యాదీవెన వంటి పథకాలతో ప్రజలలో సంతృప్తిస్థాయి మరింత పెరిగిందన్నారు. గడిచిన మూడేళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ. లక్షా 50 వేల కోట్ల సంక్షేమాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమచేసినట్లు వెల్లడించారు. గ్రామ స్వరాజ్యమే ల‌క్ష్యంగా స్థాపించిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను.. నేడు దేశమంతా కీర్తిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతిఆయోగ్ సైతం ప్రశంసించడం జరిగిందన్నారు.

కరోనా కష్టకాలంలోనూ ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించలేదని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేకుంటే.. కరోనా సమయంలో అత్యంత మరణాలు సంభవించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేదని అభిప్రాయపడ్డారు. జగనన్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకనే.. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి నాయకులు కడుపు మంటతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మహానాడులో టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మాణాలను చూసి తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రూ. మూడున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అప్పులు ఉన్నా.. సంక్షేమం మాత్రం మన రాష్ట్రంలోనే పెద్దఎత్తున అమలు అవుతోందని తెలిపారు. అనంతరం సేవా కార్యక్రమాలలో భాగంగా పేదలకు మజ్జిగను పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, కార్పొరేటర్లు పెనుమత్స శిరీష సత్యం, ఎండి షాహినా సుల్తానా, యరగొర్ల తిరుపతమ్మ, బంకా శకుంతల దేవి, కుక్కల అనిత, ఉమ్మడి రమాదేవి, జానారెడ్డి, కొంగితల లక్ష్మీపతి, డివిజన్ ఇంఛార్జిలు గుండె సుందర్ పాల్, అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, బెవర నారాయణ, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *