విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులను రక్షించాలని, వారికి న్యాయం జరగాలని హైకోర్టు న్యాయవాది నక్కా రజని అన్నారు. ఈమేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దిశ ఎన్ కౌంటర్ ఒక భూటకమని సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిందని, దిశ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పది మంది పోలీసుల పై 302సెక్షన్ విధించిందని తెలిపారు. దోషులో, నిర్దోషులు తెలియకుండానే చట్టాన్ని దుర్వినియోగ పరిచి దిశ ఎన్ కౌంటర్ చేశారని, పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఇక కోర్టులు ఎందుకని ఆమె ప్రశ్నించారు. దిశ ఎన్ కౌంటర్ లో దోషులో, నిర్దోషులో చెప్పడానికి కోర్టు ఉందని ప్రజల మెప్పు కోసం, రాజకీయ లబ్ది కోసం న్యాయాన్ని నిరూపించలేక, సాక్ష్యాలు తారుమారు చేయడానికి పేద వాళ్ళని బలిపశువులుగా చేశారని ఆరోపించారు.మొన్న అయేషా ఘటన లో ఇంతవరకు దోషులను పట్టుకోలేదు కానీ సత్యంబాబు నిర్దోషిగా విడుదల చేయడానికి ఎంత సమయం పట్టిందో అందరికీ తెలుసని తమకు కావాల్సింది న్యాయం మాత్రమే నని ఎన్ కౌంటర్ కాదని తేల్చిచెప్పారు. ఇప్పటికైన దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబానికి రక్షణ కల్పించి కోర్టు ద్వారా మాత్రమే తగు న్యాయం చేయాలని ఆమె కోరారు.
Prajavartha Online Telugu News