Breaking News

పెట్టుబడుల సాధనకు దావోస్ పర్యటన దోహదం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-63 వ డివిజన్ లో ఉత్సాహంగా సాగిన రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ సామ్రాజ్యాన్ని నెలకొల్పారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63 వ డివిజన్ – 273 వ వార్డు సచివాలయం పరిధి కొత్త రాజీవ్ నగర్లో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం ఉత్సాహంగా సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దాదాపు 500 గడపలను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. కొత్త ఏర్పడుతున్న కాలనీలకు త్రాగునీరు, సైడ్ కాలువలు, వీధి దీపాల సౌకర్యం కల్పించాలని సూచించారు. అలాగే డాక్టర్స్ కాలనీలో బీటీ రోడ్లకు సంబంధించి రూ. కోటి 20 లక్షల నిధులు మంజూరయ్యాయని.. వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. అనంతరం స్థానికంగా నివాసం ఉంటున్న గోవింద్ అనే వ్యక్తికి కొండ పావులూరు లేఅవుట్ లో మంజూరైన ఇంటి పట్టాను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు.

పర్యటనలో భాగంగా పలువురు అగ్రిగోల్డ్ బాధితులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆర్‌బీఐ ఒప్పుకోదన్న కుంటిసాకుతో చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల బలవన్మరణాలకు, వారి కుటుంబాలు రోడ్డున పడడానికీ కారకులయ్యారని మల్లాది విష్ణు అన్నారు. పైగా అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని గత పాలకులు తీవ్ర ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. కానీ సీఎం వైఎస్‌ జగన్ పరిపాలనలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగిందని తెలిపారు. వార్డు సచివాలయం ద్వారా అగ్రిగోల్డ్ బాధితులను పారదర్శకంగా గుర్తించినట్లు వెల్లడించారు. బాధితులకిచ్చిన హామీని నెరవేర్చే ఉద్దేశంతో రెండు దశల్లో 10.4 లక్షల కుటుంబాలకు ఏకంగా రూ.905.57 కోట్లను ముఖ్యమంత్రివర్యులు విడుదల చేశారని వివరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 91,589 మందికి రూ. 82.46 కోట్ల నిధులు చెల్లించామన్నారు. రూ. 10 వేల లోపు డిపాజిట్ దారులు 54,027 మందికి రూ. 29.52 కోట్లు, రూ. 20 వేల లోపు డిపాజిట్ దారులు రూ. 37,562 మందికి రూ. 52.95 కోట్లు వారి ఖాతాలలో నేరుగా డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా మోసపోయిన డిపాజిటర్లలో ఎక్కువ మంది కష్టజీవులు, రోజువారీ కూలీలు మరియు ఫ్యాక్టరీ కార్మికులే ఉన్నారన్నారు. అటువంటి వారికి ఈ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. డబ్బులు పడని బాధితులకు సైతం త్వరలో నిధులు జమ అయ్యేలా చూస్తామని హామీనిచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదరిక నిర్మూలనే ప్రధాన అజెండాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. 6 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో 4.5 కోట్ల మందికి మూడేళ్లలో దాదాపు రూ. లక్షా 50 వేల కోట్ల సంక్షేమాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. అర్హత ఉండి సంక్షేమం అందని వారి కోసం జూన్ మరియు డిసెంబర్ మాసాలలో అందజేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మరోవైపు దావోస్‌ లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సులో గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకోవడం శుభ పరిణామమని మల్లాది విష్ణు అన్నారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు సీఎం జగన్‌ నేతృత్వంలో రాష్ట్రం దావోస్‌ వేదికగా చక్కటి ఫలితాలు సాధించిందన్నారు. ఒక్క గ్రీన్ ఎనర్జీలోనే దాదాపు రూ. లక్షా 25 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. స్టీల్‌ తో పాటు, ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్, రవాణా, ప్యాకేజీంగ్‌ తదితర రంగాల్లో ఉన్న ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూపు మన రాష్ట్రంలోకి గ్రీన్‌ ఎనర్జీ వేదికగా అడుగు పెడుతున్నట్లు తెలిపారు. దీని ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే దావోస్‌ వేదికపై వైద్యం, ఆరోగ్యం, విద్యా తదితర రంగాల్లో రాష్ట్రం తన ప్రగతిని బలంగా వినిపించిందన్నారు. కనుకనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క పర్యటనతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు.

విద్యుత్ రంగం కుదేలవడానికి గత చంద్రబాబు అసమర్థ పాలనే ప్రధాన కారణమని మల్లాది విష్ణు అన్నారు. ఒకవైపు అప్పులు, మరోవైపు బకాయిలు పెంచి.. గత పాలకులు అడ్డగోలుగా విద్యుత్‌ సంస్థలను నడిపారని మండిపడ్డారు. విద్యుత్ సంస్థలకు రూ.20,790 కోట్లు ఉన్న అప్పును రూ.69 వేల కోట్లకు పెంచిన ఘనత చంద్రబాబుది అని దుయ్యబట్టారు. విద్యుత్ బకాయిలను రూ.21,540 కోట్లకు పెంచిన పాపం ముమ్మాటికీ చంద్రబాబుదేనని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలను ఈ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ లోనే తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ టారీఫ్ ఛార్జీలు దేశంలో ఏపీలోనే స్వల్పమని ఉద్ఘాటించారు. కనుక విద్యుత్ చార్జీలపై ప్రతిపక్షాల నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అనంతరం రెండు రోజుల పర్యటనలో తనపై చూపిన ప్రేమానురాగాలకు డివిజన్ ప్రజలకు పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ (ఎలక్ట్రికల్) కృష్ణారెడ్డి, నాయకులు మోదుగుల గణేష్, పసుపులేటి యేసు, సీహెచ్ రవి, టెక్కం కృష్ణ, లొనగాని నాగు, తిరుపతిరావు, నాగేశ్వరరావు, ఎం. శ్రీను, కె. రవి, పార్టీ శ్రేణులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *